స్థానిక సమరానికి సన్నద్ధం
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:38 AM
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఇతర పార్టీల నేతలు సన్నద్ధం అవుతున్నారు. అధికార యంత్రాంగం ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టిన నేపథ్యంలో గ్రామాల్లో సందడి మొదలైంది. ఆరు గ్యారంటీలే ప్రధానంగా అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పథకాల అమలు తీరును ప్రజలకు వివరిస్తూ పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ వ్యూహాత్మకంగా గ్రామాల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.
- పది నెలల క్రితం ముగిసిన సర్పంచుల పదవీకాలం
- పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీల దృష్టి
- హామీల అమలుపై కాంగ్రెస్ ప్రచారం
- హామీలపై నిలదీస్తూ ప్రజల్లోకి బీఆర్‌ఎస్, బీజేపీ
- ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం
- జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు
- 2268 వార్డులు
- 3.46 లక్షలమంది గ్రామీణ ఓటర్లు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఇతర పార్టీల నేతలు సన్నద్ధం అవుతున్నారు. అధికార యంత్రాంగం ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టిన నేపథ్యంలో గ్రామాల్లో సందడి మొదలైంది. ఆరు గ్యారంటీలే ప్రధానంగా అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పథకాల అమలు తీరును ప్రజలకు వివరిస్తూ పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ వ్యూహాత్మకంగా గ్రామాల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.
గ్రామ స్థాయిలోకి పార్టీల ప్రతినిధులు
సంక్రాంతికి కొత్త సర్పంచులు వస్తారని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో జిల్లాలో వివిధ పార్టీల ప్రతినిధులు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. గ్రామస్థాయిలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ముందుంటున్నారు. స్థానిక ఎన్నికల ఆశావహులు గ్రామాల్లో తిరుగుతూ అందరినీ పలకరిస్తున్నారు. చిన్న చిన్న శుభకార్యాలకు సైతం హాజరవుతున్నారు. ఎవరికి వారే తమ ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా సిద్ధం అవుతున్నారు. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు, 2268 వార్డులు ఉన్నాయి. వార్డు సభ్యులుగా, సర్పంచులుగా గెలుపొందే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నోటిఫికేషన్ రావడమే తరువాయిగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసి పది నెలలవుతోంది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అదే క్రమంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యుల పదవీ కాలం జూలైలో ముగిసింది. దాదాపు ఐదు నెలలవుతోంది. జనవరితో మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం కూడా ముగియనుంది. పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలే వరుసగా ఉండడంతో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
ప్రభుత్వ పథకాలే ప్రధానం
కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పఽథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించే దిశగా సిద్ధమవుతోంది. జిల్లాలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిపై స్థానిక ఎన్నికల ప్రధాన భాధ్యత ఉండే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లోని నేతలు పోటీకి ఎవరికి వారే సిద్ధం అవుతున్నారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం ద్వారా ఆశావహులు పదవులను అందిపుచ్చుకోవాలనే తాపత్రయంతో ఉన్నారు. రిజర్వేషన్లు అనుకూలిస్తే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మెజార్టీ సీట్లు సాధించాలనే లక్ష్యంగా ఉన్నారు.
వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా జిల్లాలో ఎలాంటి అభివృద్ధి లేదనీ, ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం చెందారని బీఆర్‌ఎస్ నేతలు ప్రచారం మొదలు పెట్టారు. వీలైన సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పదవీ కాలం ముగిసిన స్థానిక సంస్థల్లో మెజార్టీగా బీఆర్‌ఎస్ ప్రతినిధులే ఉన్నారు. ఈసారి కూడా మాజీ ప్రజాప్రతినిధులు మళ్లీ బరిలో నిలవడానికి సిద్ధం అవుతున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉన్నా తమ కుటుంబ సభ్యులనే బరిలో నిలిపే విధంగా సిద్ధం అవుతున్నారు.
స్థానిక ఎన్నికలపై బీజేపీ దృష్టి
జిల్లాలో బీజేపీ నేతలు స్థానిక ఎన్నికలపై దృష్టి సారించారు. కరీంనగర్ ఎంపీగా కేంద్ర హోం సహాయ మంత్రిగా బండి సంజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బండి సంజయ్ స్థానిక ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. తన ఎన్నిక కోసం సహకరించిన నేతలను గెలిపించుకునే లక్ష్యంగా పనిచేస్తారనే చర్చ సాగుతోంది. ఇంతకుముందు వేములవాడ సిరిసిల్ల మున్సిపాలిటీతోపాటు స్థానిక సంస్థల్లోనూ కొన్ని స్థానాల్లో గెలుపొందారు. ఈ సారి మెజార్టీగా గెలుపొందాలని భావిస్తున్నారు.