Share News

అభివృద్ధికి ప్రాధాన్యం..

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:10 AM

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ పాటుపడుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో విద్య, వైద్యం, విద్యుత్‌, రహదారుల అభివృద్ధితో పాటు టూరిజానికి ప్రాధాన్యం ఇచ్చారు.

అభివృద్ధికి ప్రాధాన్యం..
పత్తిపాక రిజర్వాయర్‌ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(ఫైల్‌)

- పెద్దపల్లికి బస్‌ డిపో మంజూరు

- మానేరుపై వంతెనల నిర్మాణానికి నిధులు

- ఏడాదిలో రూ.2,500 కోట్ల పనులకు శ్రీకారం

- ప్రతిపాదనల్లో రామగుండం 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటు

- పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణానికి అడుగులు

(ఆంధ్రజ్యోతి. పెద్దపల్లి)

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ పాటుపడుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో విద్య, వైద్యం, విద్యుత్‌, రహదారుల అభివృద్ధితో పాటు టూరిజానికి ప్రాధాన్యం ఇచ్చారు. పెద్దపల్లికి బస్‌ డిపోను మంజూరుచేయగా, మానేరుపై రెండు వంతెనల నిర్మాణాలు, రోడ్ల అభివృద్ధి, ఆసుపత్రుల అప్‌గ్రెడేషన్‌తో పాటు సుమారు 2,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. అర్ధంతరంగా నిలిచిపోయిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు 513 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అలాగే రామగుండంలో బీ-థర్మల్‌ ప్రాజెక్టులో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, రైతుల చిరకాల వాంఛ అయిన పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రి వర్గం రాగా, రామగుండం, ధర్మారం, పెద్దపల్లిలో జరిగిన కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయా శాఖల మంత్రులు హాజరయ్యారు. ఈనెల 4వ తేదీన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జిల్లాలో చేపట్టనున్న 1,024 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం గమనార్హం.

ఫ రహదారులు, వంతెనలకు నిధులు..

జిల్లాలో మానేరు నదిపై రెండు వంతెనలు, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు మంజూరుచేసింది. ఓదెల మండలం రూప్‌నారాయణపేట్‌ వద్ద మానేరుపై వంతెన నిర్మాణానికి రూ.80 కోట్లు, మానేరుపై మంథని మండలం శివ్వారం వద్ద మానేరుపై మరో వంతెన నిర్మాణానికి 125 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. రూ.162 కోట్లతో మంథని పట్టణం చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ పనులకు ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రూ.30కోట్లు మంజూరు చేయించారు. ఎల్‌ మడుగుకు వెళ్లే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ఎక్లాస్‌పూర్‌-ఖమ్మపల్లి రోడ్డు వెడల్పుకు రూ.11.90 కోట్లు, ఖానాపూర్‌ నుంచి ఎల్‌.మడుగు వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి 7 కోట్ల రూపాయలు, పెంచికల్‌పేట్‌ నుంచి ఎఫ్‌సీఐ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు, రాజాపూర్‌ బండలవాగుపై వంతెన నిర్మాణం, మంగపేట రోడ్‌ కోసం రూ.3 కోట్లు మంజూరు చేశారు. పెద్దపల్లి పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలను నివారించేందుకు ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి రూ.82 కోట్లు. ఆర్‌అండ్‌బీ ద్వారా కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, ఎలిగేడు,. సుల్తానాబాద్‌ మండలాలను అనుసంధానం చేసేందుకు, జూలపల్లిలో హుస్సేనిమియావాగుపై వంతెన నిర్మాణానికి 80 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. పెద్దపల్లి మున్సిపాలిటీలో టీయూఎఫ్‌ఐడీ ద్వారా రూ.77.90 కోట్లు, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో రూ.31.55 కోట్ల నిధులు మంజూరుచేయగా, పనులు నడుస్తున్నాయి. జేఎన్‌టీయూసీ నుంచి గోదావరిఖని ఫైవింక్లయిన్‌ వరకు 14 కోట్లతో నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. రూ.10 కోట్ల సీఎం స్పెషల్‌ గ్రాంట్‌, రూ.40 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో వివిధ పనులు చేపట్టారు. రూ.63 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రామగుండం ఫ్లైఓవర్‌ రైట్‌ఆర్మ్‌, గ్రామాల్లో డబుల్‌ రోడ్లు, సర్వీస్‌ రోడ్లకు నిధులు కేటాయించారు. రూ.26 కోట్లతో సింగరేణి కాలనీల్లో అంతర్గత రహదారులు, మున్సిపల్‌లో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి రూ.20 కోట్ల ప్రత్యేక నిధులు, ఫ్లడ్‌ గ్రాంట్‌ కింద రూ.2 కోట్లు మంజూరు చేయించారు.

ఫ విద్య, వైద్యం, విద్యుత్‌, టూరిజానికి ప్రాధాన్యం..

రామగిరిఖిల్లా, మంథని సర్క్యూట్‌గా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు 6కోట్ల రూపాయలతో పనులను ప్రారంభిస్తున్నారు. మంథని, పోతారంలో రెండు సబ్‌స్టేషన్ల నిర్మాణాలకు రూ.10కోట్లు, అడవిసోమన్‌పల్లిలో న్యూ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవన సముదాయ నిర్మాణానికి రూ.250 కోట్లు మంజూరు కాగా, మంత్రి శ్రీధర్‌బాబు భూమి పూజ చేశారు. మంథనిలోగల 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ.5కోట్లు, గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.2.43 కోట్లు, అర్ధంతరంగా నిలిచిపోయిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తిచేయించేందుకు రూ.513 కోట్లు మంత్రి శ్రీధర్‌బాబు మంజూరుచేయించారు. పెద్దపల్లి ప్రజల రెండు దశాబ్దాల చిరకాల వాంఛ అయిన పెద్దపల్లికి ఆర్టీసీ బస్సు డిపో మంజూరుచేయగా, సీఎం శంకుస్థాపన చేశారు. బస్టాండ్‌ను ఆనుకుని ఉన్న 4.31 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. గ్రంథాలయ భవనానికి రూ.5 కోట్లు, మహిళా ప్రాంగణం భవనానికి రూ.5కోట్లు, జడ్పీ భవనానికి రూ.8.15 కోట్లు, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల మండలాల్లో తహసీల్దార్‌ కార్యాలయాల భవనాలకు కోటి రూపాయలు, కాల్వశ్రీరాంపూర్‌ కేజీబీవీ పాఠశాలలో అదనపు తరగతి గదులు, ల్యాబ్‌ కోసం రూ.3.25 కోట్లు మంజూరుచేశారు. పెద్దపల్లిలో బాలికల జూనియర్‌ కళాశాల భవనానికి రూ.20 కోట్లు, ఎన్నో ఏళ్లుగా పెండింగులోగల పెద్దపల్లి రూరల్‌, మహిళా, ట్రాఫిక్‌, ఎలిగేడు పోలీస్‌స్టేషన్లు మంజూరయ్యాయి. పెద్దపల్లి ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం, కాచాపూర్‌, రంగాపూర్‌లో సబ్‌ స్టేషన్ల నిర్మాణాలకు రూ.25.89 కోట్లతో చేపట్టనున్న పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క శ్రీకారం చుట్టారు. న్యూఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవన సముదాయ నిర్మాణానికి రూ.250 కోట్లు, పెద్దపల్లి ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తూ రూ.51కోట్లు మంజూరుచేశారు. టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో రామగుండం నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులు, రూ.180 కోట్లు అమృత్‌ నిధులు మంజూరు, ఎస్‌టీపీల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. రూ.15 కోట్లతో సింగరేణి ఆధ్వర్యంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌, గోదావరిఖని జనరల్‌ ఆసుపత్రిలో 350 పకడల ఆసుపత్రి నిర్మాణానికి రూ.140 కోట్లు మంజూరు చేయించారు. ఎమర్జెన్సీ వార్డుకు రూ.16 కోట్లు, నర్సింగ్‌ కళాశాల నిర్మాణానికి రూ.16 కోట్లు, పారా మెడికల్‌ కళాశాల మంజూరు చేయించారు. రూ.10 కోట్లతో సింగరేణి ఆసుపత్రిలో క్యాత్‌ల్యాబ్‌, రూ.100 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల మంజూరు, రామగుండంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరుచేయించారు. రామగుండం అర్బన్‌ డెవలప్‌మెట్‌ అథారిటీ ఏర్పాటు చేయించగా, జెన్‌కో, సింగరేణి సంయుక్త ఆధ్వర్యంలో 800 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గోదావరిఖనిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, రామగుండంలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం ప్రారంభం, బండలవాగు ప్రాజెక్టు ఎలక్ర్టికల్‌ పనులకు రూ.10 కోట్లు మంజూరు చేయించారు. వీటిలో కొన్ని పనులు ప్రారంభం కాగా, మరికొన్ని ప్రారంభం కావల్సి ఉన్నాయి. ఇంకా జిల్లాలో అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నాయి.

Updated Date - Dec 29 , 2024 | 01:11 AM