అసమానతలకు వ్యతిరేకంగా రంగవల్లి పోరాటం
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:55 AM
సమాజంలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప మహిళ రంగవల్లి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం రంగవల్లి వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి నందికమాన్ సమీపంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన కేంద్రాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో కలిసి ప్రారంభించారు.
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ టౌన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): సమాజంలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప మహిళ రంగవల్లి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం రంగవల్లి వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి నందికమాన్ సమీపంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన కేంద్రాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రంగవల్లి విజ్ఞాన కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటు చేశారన్నారు. ఆదివాసీ బిడ్డలకు అండగా నిలిచారని గుర్తు చేశారు.
ప్రజల పక్షాన పోరాడిన వీర వనిత రంగవల్లి
గొప్ప కుటుంబంలో పుట్టి ప్రజల పక్షాన పోరాటం చేసిన వీరవనిత రంగవల్లి అని ఉస్మానియ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసీం అన్నారు. విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన నిలబడిన ప్రతీ ఒక్కరు అమరత్వం పొందారన్నారు. సాయుధ పోరాటంలో ఉద్యమించిన రంగవల్లిని ఎన్‌కౌంటర్ చేయడం హేయమైన చర్యన్నారు. పోలీసులు పట్టుకున్న తరువాత కోర్టు ఎదుట ఉంచి వారు చేసిన నేరాన్ని విచారించాలని, కానీ ఇద్దరు పురుషులను, మహిళలను ఎన్‌కౌంటర్ చేసి రాజకీయ వాతావరణాన్ని సృష్టించారని గుర్తు చేశారు.
రంగవల్లి నేటి తరానికి స్ఫూర్తిదాయకం
భూస్వామ్య, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన విప్లవ కెరటం రంగవల్లి అని, ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు. విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో భాగంగా ఆమె మాట్లాడారు. నందికమాన్ చౌరస్తాలో అమరుల జ్ఞాపకార్థం స్తూపాన్ని నిర్మించాలని అనుకున్నామని, కొన్ని కారణలతో జరగలేదని అన్నారు. సమాజానికి జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతోనే విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి, స్థానిక కౌన్సిలర్ నీలం కళ్యాణి, ప్రముఖ న్యాయవాది భగవంతరెడ్డి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.