Share News

రేషన్‌ బియ్యం పక్కదారి

ABN , Publish Date - Dec 10 , 2024 | 01:26 AM

ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అందజేస్తున్న రేషన్‌ బియ్యం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పక్కదారి పడుతున్నాయి. తరచూ టాస్క్‌ఫోర్స్‌, పౌరసరఫరాల శాఖ దాడులు నిర్వహిస్తున్నా దందా ఆగడం లేదు. ఇతర జిల్లాల్లో సేకరించిన రేషన్‌ బియ్యం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైస్‌మిల్లులకు తరలివస్తున్నాయి.

 రేషన్‌ బియ్యం పక్కదారి

(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)

ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అందజేస్తున్న రేషన్‌ బియ్యం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పక్కదారి పడుతున్నాయి. తరచూ టాస్క్‌ఫోర్స్‌, పౌరసరఫరాల శాఖ దాడులు నిర్వహిస్తున్నా దందా ఆగడం లేదు. ఇతర జిల్లాల్లో సేకరించిన రేషన్‌ బియ్యం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైస్‌మిల్లులకు తరలివస్తున్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నుంచి రెండు వాహనాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం ఎన్గల్‌ గ్రామం వద్ద ఒక రైస్‌మిల్లుకు తరలిస్తున్న బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఏకకాలంలో జిల్లాలో దాడులు నిర్వహించి 240 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేయడంతోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. జిల్లాలో నామామాత్రపు కేసులు, నిఘా లోపంతో రేషన్‌ బియ్యం దందా జోరుగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పంపిణీ అవుతున్న రేషన్‌ బియ్యాన్ని గ్రామాలు, పట్టణాల్లో సేకరించి వాటిని జిల్లాకు పొరుగున ఉన్న మహారాషకు తరలిస్తున్నారు. జిల్లా నుంచి రేషన్‌ బియ్యం అక్రమంగా తరలివెళ్తున్న క్రమంలోనే టాస్క్‌ఫోర్స్‌ దాడులు నిర్వహించినట్లుగా చెప్పుకుంటున్నారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా లేకపోవడంతో యథేచ్ఛగా రవాణా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

వేలి ముద్ర వేస్తే నగదు

జిల్లాలో రేషన్‌ దుకాణాల్లోనే బియ్యంకు బదులు డీలర్లు నగదు అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా రేషన్‌ బియ్యం మళ్లీ మిల్లర్లకు అందిస్తున్నారు. రేషన్‌ డీలర్లు వేలి ముద్ర వేసిన లబ్ధిదారులకు కిలో రూ.10 నుంచి 12 వరకు చెల్లిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్‌లకు దొడ్డు బియ్యం, అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎంఆర్‌ కింద మళ్లీ మిల్లుల ద్వారా ప్రభుత్వానికే చేరుతున్నాయి. రేషన్‌ బియ్యం కాసులు కురిపిస్తుండడంతో ప్రత్యేకంగా రేషన్‌ బియ్యం సేకరణ కూడా జోరుగా సాగుతోంది. జిల్లాలో ఏటా అధికారులు పట్టుకున్న బియ్యమే లక్షల్లో ఉంటుంది.

జిల్లాలో 32.43 లక్షల కిలోల బియ్యం పంపిణీ

జిల్లాలో బడుగు, బలహీన వర్గాల కోసం 345 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతినెలా 1,73,728 రేషన్‌ కార్డుల ద్వారా 4,97,000 మంది లబ్ధిదారులకు 32 లక్షల 43 వేల 597 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. పేదలకు గతంలో సాధారణ దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. తాజాగా ఫోర్టిపైడ్‌ రైస్‌ను సరఫరా చేస్తున్నారు. పోషకాల బియ్యంలో ఐరన్‌, విటమిన్‌, బీ 12, బీ 1, బీ6, జింక్‌, పొలిక్‌యాసిడ్‌తోపాటు మరికొన్ని పొడులను కలిపి అందిస్తున్న రేషన్‌ బియ్యం పేదలకు అందకుండా పక్కదారి పడుతున్నాయి. సాధారణంగా కేసులు నమోదు చేయడం, మౌనం దాల్చడంతో జిల్లాలో మళ్లీ యఽథాతథంగా రేషన్‌ దందా పెరిగింది.

Updated Date - Dec 10 , 2024 | 01:26 AM