Share News

సమరానికి సై

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:22 AM

లోక్‌సభ ఎన్నికల సమరానికి తెరలేచింది. ఇప్పటికే షెడ్యూలు విడుదల కాగా గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్ల పక్రియ మొదలు కావడంతో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో రాజకీయ సమరానికి తెరలేచింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు ఖరారు కావడంతో రెండు సెగ్మెంట్లలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

సమరానికి సై

- వెలువడిన లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌

- మొదలైన నామినేషన్ల స్వీకరణ

- 25వరకు నామినేషన్లు... మే 13న పోలింగ్‌

- ఫలితాలకు జూన్‌ 4 వరకు ఆగాల్సిందే

- బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రచారాలు

- కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఉత్కంఠ

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

లోక్‌సభ ఎన్నికల సమరానికి తెరలేచింది. ఇప్పటికే షెడ్యూలు విడుదల కాగా గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్ల పక్రియ మొదలు కావడంతో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో రాజకీయ సమరానికి తెరలేచింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు ఖరారు కావడంతో రెండు సెగ్మెంట్లలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు ప్రచారంలో ముందు వరుసలో నిలిచే ప్రయత్నంగా సన్నద్ధం అయ్యారు. ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో జోష్‌ కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పార్టీని వీడుతుండడంతో కొంత సబ్ధతగా ఉంది. లోక్‌సభ నామినేషన్ల పర్వం మొదలు కావడంతో సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో రాజకీయ వేడి మొదలైంది.

ఫ వేగంగా ఎన్నికల ఏర్పాట్లు

సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంఽధించిన ఈవీఎంలు, ఇతర సామగ్రిని సిద్ధం చేశారు. ఈనెల 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా 26న పరిశీలన, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ, మే 13న పోలింగ్‌ నిర్వహించనున్నారు. పోలింగ్‌ వరకు సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఫలితాల కోసం జూన్‌ 4 వరకు ఆగాల్సిందే. ఇందుకు సంబంధించి రెండు సెగ్మెంట్లలో 537 పోలింగ్‌ కేంద్రాలు, కావాల్సిన బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, వీవీప్యాట్లులను ఇప్పటికే సిద్ధం చేసి ర్యాండమైజేషన్‌ పూర్తి చేశారు.

ఫ రెండు సెగ్మెంట్లలో 4.72లక్షల మంది ఓటర్లు

లోక్‌సభ ఎన్నికల కోసం ఓటరు జాబితాను సిద్ధం చేశారు. తుది జాబితా తరువాత ఏప్రిల్‌ 15 వరకు ఓటు నమోదుకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో 1,197 మంది ఉపయోగించుకున్నారు. రెండు సెగ్మెంట్లకు సంబంధించి కొత్త ఓటరు జాబితా ప్రకారం నాలుగు లక్షల 72 వేల 116 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,27,534 మంది, మహిళలు 2,44,543 మంది, ఇతరులు 39 మంది ఉన్నారు. వేములవాడ సెగ్మెంట్‌లో 2,25,904 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,07,952 మంది, మహిళలు 1,17,920 మంది ఇతరులు 32 మంది ఉన్నారు. సిరిసిల్ల సెగ్మెంట్‌లో 2,46,212 మంది ఉండగా పురుషులు 1,19,582 మంది, మహిళలు 1,26,623 మంది, ఇతరులు ఏడు మంది ఉన్నారు. రెండు సెగ్మెంట్లలో మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో 4,72,116 మంది ఓటర్లు ఉండగా మహిళలు అధికంగా 17,009 మంది ఉన్నారు. వేములవాడ సెగ్మెంట్‌లో మహిళలు 9,968 మంది, సిరిసిల్ల సెగ్మెంట్‌లో మహిళలు 7,041 మంది అధికంగా ఉన్నారు. సెగ్మెంట్లలో ఎన్నికల సమయంలో ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్‌ బూత్‌ల్లో ఓట్లు వేసే పరిస్థితులు లేకుండా ఒకే పోలింగ్‌ కేంద్రానికి మార్చారు. పోలింగ్‌ కేంద్రాల్లో 1,500 మంది ఓటర్లకు మించి ఉండకుండా చర్యలు చేపట్టారు.

ఫ జిల్లాలో నిఘా.. తనిఖీలు

లోక్‌సభ ఎన్నికల నేపఽథ్యంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో సిరిసిల్ల, వేములవాడ రెండు సెగ్మెంట్లలో పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘా పెంచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. తంగళ్లపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జిల్లెల చెక్‌పోస్టు, గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పెద్దమ్మ చెక్‌ పోస్ట్‌, ముస్తాబాద్‌, పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెంకట్రావుపల్లి, వేములవాడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఫాజుల్‌నగర్‌ చెక్‌పోస్టు, బోయినపల్లి చెక్‌పోస్టు పరిధిలో కొదురుపాక, రుద్రంగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మానాల క్రాస్‌ రోడ్డు వద్ద చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా నగదు, అక్రమ మద్యంపై కూడా నిఘా పెట్టారు. వివిధ పార్టీల నాయకులు ప్రచారాలకు జిల్లాకు వస్తున్న నేపఽథ్యంలో వారి వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. రూ 50 వేలకు పైగా నగదు ఉంటే అధారాలు చూపని పక్షంలో సీజ్‌ చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై కూడా ఎన్నికల కమిషన్‌ దృష్టి పెట్టింది.

ఫ జిల్లాకు కేంద్ర సాయుధ బలగాలు...

లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా బందోబస్తు కోసం కేంద్ర సాయుధ బలగాలు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకున్నాయి. సాయుధ బలగాలు కవాతులు నిర్వహించి మేమున్నామంటూ భరోసాను ఇస్తున్నారు. జిల్లా పోలీస్‌ యంత్రాంగం నిరంతరం ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

నామినేషన్ల ప్రక్రియ షురూ..

- తొలిరోజు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు

పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమైంది. కరీంనగర్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలోని కలెక్టర్‌ ఛాంబర్‌లో కరీంనగర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం నుంచి 100 మీటర్ల దూరం వరకు ప్రజలను అనుమతించారు. గురువారం మొదటి రోజు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామినేషన్లను సమర్పించారు. తొలి నామినేషన్‌ను నగరంలోని విద్యానగర్‌కు చెందిన కోట శ్యాంకుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతికి అందజేశారు. గంగాధర మండలం గట్టుభూత్కూర్‌ గ్రామానికి చెందిన పొత్తూరి రాజేందర్‌ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల అధికారికి అందజేశారు. నామినేషన్ల దాఖలు చేసేందుకు వచ్చిన వారికి హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసి నామినేషన్‌ పత్రాలను అందుబాటులో ఉంచారు. అదనపు కలెక్టర్లు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా నామినేషన్ల పత్రాలను పరిశీలించారు. శుక్రవారం బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌కుమార్‌ నామినేషన్‌ను సమర్పిస్తారు.

Updated Date - Apr 19 , 2024 | 01:22 AM