జీతం ఇక్కడ.. వైద్యం అక్కడ
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:53 AM
జిల్లాలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ వైద్యుల తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఆసుపత్రి పనివేళల్లో తమ సొంత క్లినిక్‌ల్లో సేవలు అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రధాన ఆసుపత్రి, మాతాశిశు కేంద్రంతో పాటు జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ పట్టణాల్లో గల తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, పలు పీహెచ్‌సీ, యూహెచ్‌సీ, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్యుల్లో చాలామంది ప్రైవేటు ప్రాక్టిస్‌పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జగిత్యాల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ వైద్యుల తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఆసుపత్రి పనివేళల్లో తమ సొంత క్లినిక్‌ల్లో సేవలు అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రధాన ఆసుపత్రి, మాతాశిశు కేంద్రంతో పాటు జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ పట్టణాల్లో గల తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, పలు పీహెచ్‌సీ, యూహెచ్‌సీ, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్యుల్లో చాలామంది ప్రైవేటు ప్రాక్టిస్‌పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రులకు సంబంధించి అందిస్తున్న సేవలు ఘనంగా ఉన్నాయని సంబంధిత ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అసుపత్రి పనివేళల్లో వైద్యులు అందుబాటులో లేక రోగులు నిరీక్షించాల్సి వస్తోంది. కొందరు వైద్యులు విధులను ఇతర వైద్యులకు అప్పగించి ప్రైవేట్ ప్రాక్టీస్‌లో ఉంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు కేంద్రాల్లో పనిచేస్తున్న పలువురు వైద్యుల తీరు విమర్శలకు తావిస్తోంది. వీరిని నియంత్రించే పరిస్థితి లేకపోవడంతో రోజురోజుకూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సరైనవేళలో అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రులకు వచ్చిన రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
- నిబంధనలు ఇలా..
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు అందించాలి. మధ్యాహ్న భోజనం అనంతరం రెండు గంటల నుంచి మెడికల్ కళాశాలలో టీచింగ్ విధులను పలువురు వైద్యులు నిర్వర్తించాల్సి ఉంది. ఎమర్జెన్సీ విభాగంలో సేవలు అందించే వైద్యులకు రోస్టర్ పద్ధతిలో పలువురు వైద్యులకు విధులను కేటాయిస్తున్నారు. సంబంధిత వైద్యులు ఎమర్జెన్సీ విభాగంలో సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్యులు విధినిర్వహణ సమయాల్లో ప్రైవేట్‌క్లినిక్‌ల్లో విధులు నిర్వహించకూడదు. కానీ ఈ నిబంధనలు ఆసుపత్రుల్లో అమలు కావడం లేదు. ఇక్కడ పనిచేసే వైద్యులు ఉదయం ఆసుపత్రికి వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేసి సుమారు ఉదయం 11 గంటల వరకు సొంత క్లినిక్‌కు వెళ్లిపోతున్నారు. ఒకరిద్దరు కాదు ఉన్నతాధికారి నుంచి మొదలుకొని సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ సర్జన్లు, స్పెషలిస్టుల వరకు ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు జగిత్యాల జిల్లా ఆసుపత్రితో పాటు అనుసంధానంగా మాతాశిశు ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ చిన్న జబ్బు చేసినా ఇక్కడికే వస్తారు. కానీ ఆసుపత్రి వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పేదలకు సర్కారు వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రిలో ఉండాల్సిన వైద్యులు ఉదయం 11 గంటలకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం నుంచి భారీగా జీతాలు తీసుకునే వైద్యులు సొంత క్లినిక్‌ల్లో పని చేస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం వైద్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
- సొంతంగా క్లినిక్‌లు..
జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పలువురు వైద్యాధికారులు విధులు నిర్వహించాల్సి ఉండగా పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాతాశిశు ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ద్వారా పలువురు వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. మెజారిటీ వైద్యులు సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకొని వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దాదాపు పాతికమంది వైద్యులు స్థానికంగానే సొంత క్లినిక్‌లు నడుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను వారివారి క్లినిక్‌లకు రావాలని వైద్యులు సూచించడం గమనార్హం. చాలా మంది రోగులు విధిలేక ప్రైవేట్ క్లినిక్ లకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. జిల్లా అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని ఇటు ప్రజలు, అటు రోగులు కోరుతున్నారు.
ఆసుపత్రి వేళల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు
- రాములు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జగిత్యాల
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్యాధికారులు విధుల్లో ఉండాలి. ఆసుపత్రి వేళల్లో బయట క్లినిక్‌ల్లో సేవలు అందించకూడదు. రోగులు ఎవరైనా ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము. మధ్యాహ్నం రెండు గంటల అనంతరం ప్రత్యేక విధులు నిర్వహించే వారు మినహా సదరు వైద్యులు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరము లేదు.