Share News

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వేగంగా పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:37 AM

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వేగంగా పరిష్కరించాలి
సమావేశంలో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి జిల్లా స్ధాయి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్‌ ట్రైబల్‌ శాఖల పరిధిలోని వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో పాడిపశువుల యానిట్ల గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో నవంబరు 30నాటికి మొత్తం 30 ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదయ్యాయని, వారం రోజుల్లో నివేదికలను అందించాలని ఆదేశించారు. 2016 నుంచి ఇప్పటి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం ఎనిమిది హత్యలు, నాలుగు అత్యాచారాలు, 486 ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, రూ.5 కోట్ల 64లక్షల 11వేల 250 పరిహారం మంజూరు చేశామని తెలిపారు. మరో కోటి 76లక్షల 37వేల 500 పరిహారం ఇచ్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లలో తప్పనిసరిగా చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవోలు వెంకట ఉపేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌, సెషన్స్‌ కోర్టు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాములు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మీ, ఎస్సీకార్పొరేషన్‌ ఈడీ స్వప్న, జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు కొమ్ముబాలయ్య, అజ్మీరా తిరుపతినాయక్‌, మెట్ట దేవానందం, కొట్టేపల్లి సుధాకర్‌, అలువాలు ఈశ్వర్‌, పసుల బాలరాజు, డప్పుల అశోక్‌, సిరిగిరి రామచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:37 AM