Share News

రాజన్న క్షేత్రంలో శివ కల్యాణోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:43 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో శివ కల్యాణ మహోత్సవాలు బుధవారం ప్రాంభమయ్యాయి.

రాజన్న క్షేత్రంలో శివ కల్యాణోత్సవాలు ప్రారంభం
రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

వేములవాడ, మార్చి 27: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో శివ కల్యాణ మహోత్సవాలు బుధవారం ప్రాంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో అర్చకులు, వేద పండితులు ఉదయం శివ భగవత్పుణ్యాహవచనముతో ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మండపంలో అర్చకులకు, వేదపండితులకు, కన్యాదాత దంపతులకు ఆలయ ఈవో డి.కృష్ణప్రసాద్‌ వరుణి అందజేశారు. అనంతరం ఉత్సవాల్లో భాగంగా అర్చకులు రాజరాజేశ్వరస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం పార్వతీ రాజరాజేశ్వరస్వామివారల దివ్య కల్యాణం ఆలయ చైర్మన్‌ చాంబర్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహించనున్నారు.

ఫ శివకల్యాణోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవల నిలిపివేత

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో శివకల్యాణోత్సవాల సందర్భంగా బుధవారం నుంచి ఐదు రోజులపాటు కోడెమొక్కు మినహా అన్ని రకాల ఆర్జిత సేవలను నిలిపివేశారు. గురువారం ఉదయం వేళలో కోడెమొక్కు సైతం నిలిపవేయనున్నారు. మధ్యాహ్నం అనంతరం కోడెమొక్కు చెల్లింపును పునరుద్ధరిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 12:43 AM