Share News

సర్వే షురూ....

ABN , Publish Date - Nov 10 , 2024 | 01:32 AM

ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే రెండో విడత సమాచార సేకరణ ప్రారంభమైంది. శనివారం ఉదయం 9.30 గంటల నుంచే ఎన్యూమరేట్లు తహసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాల నుంచి వారికి కేటాయించిన ఎలక్ర్టోల్‌ బ్లాక్‌లకు సర్వేకు సంబంధించిన సామగ్రిని తీసుకు వెళ్ళి ఇంటింటి సమచారాన్ని సేకరించడం ప్రారంభించారు.

సర్వే షురూ....

- కరీంనగర్‌లో పూర్తికాని స్టిక్కరింగ్‌

- తేలని కుటుంబాల సంఖ్య

- క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ పరిశీలన

కరీంనగర్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే రెండో విడత సమాచార సేకరణ ప్రారంభమైంది. శనివారం ఉదయం 9.30 గంటల నుంచే ఎన్యూమరేట్లు తహసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాల నుంచి వారికి కేటాయించిన ఎలక్ర్టోల్‌ బ్లాక్‌లకు సర్వేకు సంబంధించిన సామగ్రిని తీసుకు వెళ్ళి ఇంటింటి సమచారాన్ని సేకరించడం ప్రారంభించారు. కలెక్టర్‌ పమేలా సత్పతి కరీంనగర్‌లోని ముకరంపుర ప్రాంతంలో చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎన్యూమరేటర్లకు పలు సలహాలు సూచనలు చేశారు. కొత్తపల్లి, రామడుగు మండలాల్లో పర్యటించి సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో 1,20,000 కుటుంబాలున్నట్లు అంచనావేసిన అధికారులు, 540 మంది ఎమ్యూనరేటర్లను సర్వే కోసం నియమించారు. శుక్రవారం సాయంత్రం వరకు కుటుంబాల వివరాలను సేకరించి ఆయా ఇళ్లకు స్టిక్కరింగ్‌ చేయాల్సి ఉండగా శనివారం సాయంత్రం వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కుటుంబాల వివరణ సేకరించలేక పోయారు. స్టిక్కరింగ్‌ చేసిన ప్రాంతాల్లో సమాచారాన్ని ఎమ్యూనరేటర్లు సేకరించారు. కమిసనర్‌ చాహాత్‌ భాజ్‌పాయి పలు డివిజన్లలో పర్యటించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వేపై ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు సమాచారాన్ని ఇవ్వాలని, నగరంలోని అన్ని ఇళ్లకు ఎన్యూమరేటర్లు వచ్చి సమాచారాన్ని వచ్చి తీసుకుంటారని చెప్పారు. లక్షా 20వేల కుటుంబాలు ఉంటాయని భావించామని, అ సంఖ్య పెరిగే అవకాశమున్నందున అదనంగా 150 మందిని విధుల్లోకి తీసుకొని శిక్షణ ఇచ్చామని, ఈనెల 18లోగా సమాచార సేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలోని 15 మండలాలు, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, జమ్మికుంట, హుజురాబాద్‌, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలను 1,958 ఎలకో్ట్రల్‌ బ్లాక్‌లుగా విభజించి, సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు 1,964 మంది ఎన్యూమరేటర్లను, 207 మంది సర్వేయర్లను నియమించారు. పట్టణాలు, గ్రామాల్లో చాలా మేరకు ప్రజలు సహకరించి అడిగిన వివరాలను తెలుపుతున్నారు. ఆర్థికపరమైన, ఆస్తులకు సంబంధించిన, ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ది వివరాలను తెలుపడం లేదని సిబ్బంది అంటున్నారు.. ప్రజాపాలనలో ఇచ్చిన ఆరుగ్యారెంటీల దరఖాస్తులపై, పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, కాంగ్రెస్‌ హామీలపై కొంత మంది ఎమ్యూనరేటర్లను ప్రశ్నించగా, చాలా మంది సహకరిస్తున్నారని తెలిపారు. మొదటిరోజు సర్వే ప్రశాంతంగానే జరిగిందని అధికారులు తెలిపారు.

ఫ ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా సర్వేకు సహకరించండి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

సర్వే వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందని, ఎలాంటి అపోహలు, సందేహాలు పెట్టుకోకుండా ప్రశ్నావళిలోని ప్రతి అంశానికి సరైన సమాధానమిచ్చి సర్వేకు సహకరించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి కోరారు. శనివారం ఆమె జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేలోని జనాభా, ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా పరమైన స్థితిగతులను ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు, అన్ని వర్గాలకు మేలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకునే వీలుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించి సర్వేను విజయవంతం చేయాలని కోరారు. తప్పుడు సమాచారమిచ్చినా, ప్రశ్నావళిలో తప్పుడు సమాచారాన్ని నమోదు చేసినా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సరైన సమాధానాలు ఇవ్వాలని, కుటుంబ యజమాని చెప్పిన సమాచారాన్ని మాత్రమే నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. ఈ నెల 18 వరకు కుటంబాల వారీగా సమాచార సేకరణ జరుగుతుందన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 01:33 AM