Share News

సన్న బియ్యం.. మరింత ఆలస్యం

ABN , Publish Date - Nov 24 , 2024 | 01:00 AM

రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం పొందేందుకు మరింత ఆలస్యం కానుంది. సన్న బియ్యం పొందడానికి సుమారు మరో ఆరు నెలలు ఆగాల్సిందే. జనవరిలో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినా ఆచరణ సాధ్యమయ్యేలా లేదు.

సన్న బియ్యం.. మరింత ఆలస్యం

జగిత్యాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం పొందేందుకు మరింత ఆలస్యం కానుంది. సన్న బియ్యం పొందడానికి సుమారు మరో ఆరు నెలలు ఆగాల్సిందే. జనవరిలో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినా ఆచరణ సాధ్యమయ్యేలా లేదు. ప్రస్తుతం వస్తున్న సన్న ధాన్యం బియ్యంగా చేసినా వాటిని వెంటనే వండితే అన్నం ముద్దగా అవుతుందని, అందుకే ఉగాది నాటికి సన్న బియ్యం పంపిణీ పూర్తి స్థాయిలో చేపట్టాలన్న యోచనతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు. దీంతో 2025 జనవరిలో సన్నబియ్యం వస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశ తప్పేలా లేదు. పైగా వాటి విషయంలో ఇప్పటివరకు జిల్లా అధికారులు ఎలాంటి ఉత్తర్వులు కూడా రాకపోవడంతో ఉగాది వరకు వేచి ఉండాల్సి రావచ్చని అధికారులు కూడా పేర్కొన్నారు.

భగ్గుమంటున్న ధరలు...

ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. కిలోకు రూ. 50 నుంచి రూ. 60 వెచ్చించాల్సి వస్తోంది. వాటి సరఫరా తక్కువగా వినియోగం ఎక్కువగా ఉండటంతో ధరలు పెరిగిపోయాయి. మరోవైపు ప్రభుత్వం పంపిణీ చేసే దొడ్డు బియ్యాన్ని చాలా కుటుంబాలు తినకుండా అమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి రేషన్‌ కింద సన్న బియ్యం ఇస్తామని ప్రకటించింది. అయితే ఇప్పుడు వచ్చిన ధాన్యం మరాడించి పంపిణీ చేస్తే ఆ బియ్యం వండితే ముద్ద అవుతుందని ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, మూడు నాలుగు నెలలు మాగితే బాగుంటాయని పౌరసరాఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ఉగాది నుంచి పంపిణీ చేసేలా కసరత్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

లబ్ధిదారులకు తప్పని నిరాశ

జిల్లాలో రేషన్‌కార్డు దారులకు నిరాశ తప్పడం లేదు. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం (సాధారణ రకం) తీసుకున్న ప్రజలకు ఇక సన్నబియ్యం వస్తాయని, వాటిని ఎంచక్కా తినొచ్చని భావించినా ఇప్పట్లో ఆ ఆశ నెరవేరేలా లేదు. ప్రస్తుతం జిల్లాలో మొత్తంగా 592 రేషన్‌ షాపులు ఉండగా, 3,07,127 ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. వాటికింద 8,82,187 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో మూడు రకాల కార్డులు ఉన్నాయి. ఆహార భద్రతా కార్డులు 2,92,450 ఉండగా ఆ కార్డుల్లో పేర్లు నమోదైన ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున 8,44,755 మందికి ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తోంది. 14,532 అంత్యోదయ కార్డులున్నాయి. అంత్యోదయ దారులకు ఒక్కో కార్డు కింద 35 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తోంది. అన్నపూర్ణ కార్డులు 145 ఉండగా 155 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఒక్కో కార్డు కింద 10 కిలోల చొప్పున బియ్యం ఇస్తోంది. వారంతా సన్న బియ్యం కోసం ఉగాది వరకు వేచి చూడక తప్పని పరిస్థితి.

రేషన్‌ బియ్యం తినేది కొద్ది మందే..

రేషన్‌ దుకాణాల ద్వారా అందిస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రతి నెలా సుమారు 20 శాతం మేర లబ్ధిదారులు తీసుకోవడం లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. రేషన్‌ బియ్యం తీసుకున్న వారిలోనూ 50 శాతం లోపు మందే వీటిని తినడానికి వినియోగించుకుంటున్నట్లు అంచనా వేస్తున్నారు. మిగిలిన వారు తాము కొన్న రేషన్‌ బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో కిలోకు 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. ఇవి రీసైక్లింగ్‌ అవుతున్నాయి. మరికొన్నిసార్లు రేషన్‌ బియ్యాన్ని అమ్మి బహిరంగ మార్కెట్‌లో 40 రూపాయల నుంచి 60 రూపాయలుపెట్టి సన్న బియ్యాన్ని కొంటున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఇటు పేదలపైనా ఆర్థిక భారం పడుతున్నది. రేషన్‌ బియ్యం భారీ మొత్తంలో పక్కదారి పడుతున్నదన్న ఆరోపణలున్నాయి. వ్యాపారులు ఈ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కొని మిల్లర్లకు అమ్ముతున్నారన్న విమర్శలున్నాయి. మిల్లర్లు ఈ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేసి సీఎంఆర్‌లో ఎఫ్‌సీఐకి అంటగడుతున్నారని తెలుస్తోంది. ఈనేపథ్యంలో రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తారని ఆశించిన లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా రానున్న జనవరి మాసం నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Updated Date - Nov 24 , 2024 | 01:01 AM