Share News

పదేళ్ల అభివృద్ధి ఏడాదిలో విధ్వంసం

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:49 AM

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ఏడాది తిరగక ముందే విధ్వంసం చేశారు. హైదరాబాద్‌ తర్వాత సుందరనగరంగా తీర్చిదిద్దిన కరీంనగర్‌ను కళావిహీనం చేశారు. పక్కనే ఉన్న పెద్దపల్లి, వరంగల్‌ జిల్లాలకు వరద లా నిధులను విడుదల చేస్తూ ఈ జిల్లా పట్ల మాత్రం వివక్ష చూపిస్తున్నారు.

పదేళ్ల అభివృద్ధి ఏడాదిలో విధ్వంసం

- జిల్లా పట్ల వివక్ష చూపిస్తున్న కాంగ్రెస్‌

- జెండా ఎగురవేసేది ఒకరు.. ఎజెండా తయారు చేసేది మరొకరు

- నిధులు రాకున్నా నోరు మెదపని మంత్రులు

- పోరాటాల గడ్డను మరో పోరాటానికి సిద్ధం అయ్యేలా చేయకండి

- ‘ఆంధ్రజ్యోతి’తో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ఏడాది తిరగక ముందే విధ్వంసం చేశారు. హైదరాబాద్‌ తర్వాత సుందరనగరంగా తీర్చిదిద్దిన కరీంనగర్‌ను కళావిహీనం చేశారు. పక్కనే ఉన్న పెద్దపల్లి, వరంగల్‌ జిల్లాలకు వరద లా నిధులను విడుదల చేస్తూ ఈ జిల్లా పట్ల మాత్రం వివక్ష చూపిస్తున్నారు. ఈ జిల్లాకు ఇంచార్జి మంత్రి ఉన్నారా..., ఇక్కడ మంత్రులు ఉన్నారా లేరా... ఉంటే వారు ఎందుకు నోరు మూసుకుంటున్నారు.. జెండా ఎగురవేసేది ఒకరు.. ఎజెండా నిర్ణయించేది మరొకరు... అనుభవం లేని పాలన, వివక్ష కారణంగా జిల్లాలో అభివృద్ధి కుంటుపడుతోంది’’... అన్నారు మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌. శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లాను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరిస్తున్నదని, వివక్షకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి... పోరాటాల పురిటిగడ్డ కరీంనగర్‌ను మళ్లీ పోరాటం చేసే పరిస్థితి రానివ్వకండి.. అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి అనేది నిరంతరం జరుగాల్సిన ప్రక్రియ. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో అభివృద్ధి ఆగిపోయింది. పది సంవత్సరాల పాటు స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దిన కరీంనగర్‌ గుడ్డి దీపంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా జిల్లాకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. కరీంనగర్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ హయాంలో మంజూరు చేసిన నాలుగు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి. వీటికి మేము రెండున్నర కోట్లు మంజూరు చేస్తే 60శాతం పనులు పూర్తయ్యాయి. మరో 40శాతం పనులకు నిధులు విడుదల చేయడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన పనులను కూడా నిలిపివేశారని గంగుల కమలాకర్‌ అన్నారు. 80 కోట్లతో చేపట్టిన 40 అంతర్గత రోడ్ల పనులు ఎక్కడికక్కడ కంకర వేసి ఆపేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులను మూలకు నెట్టారు. రెండు కోట్ల 25 లక్షల రూపాయలు ఈ ప్రాజెక్టుకు మంజూరు చేస్తే మధ్యలో నిలిపివేశారు. దక్షిణభారత దేశంలో రెండవదిగా మంజూరైన కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించి డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తే దానిని వినియోగంలో లేకుండా చేశారని కమలాకర్‌ ఆరోపించారు. కేబుల్‌ బ్రిడ్జిపై తారు తీసేసి ఏడాది గడిచినా కొత్తగా తారు వేయించి దాన్ని వినియోగంలోకి తీసుకురావడం లేదు. పట్టణంలోని రోడ్లపై పెద్దపెద్ద గుంతలు పడ్డా మేయింటెనెన్స్‌ పనులు చేపట్టడం లేదని అన్నారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులపై విజిలెన్సు ఎంక్వైరీ జరుగుతుందని చెబుతున్న ప్రభుత్వం విజిలెన్సు ఎంక్వైయిరీ రిపోర్టులో ఏమి తేలిందో బహిర్గతం చేయాలని కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. విజిలెన్సు పేరుతో బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేయడం మాని పనులు కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మానేరు ఒడ్డున ఇస్కాన్‌ టెంపుల్‌కు మూడెకరాల స్థలాన్ని కేటాయిస్తే ఆ భూమిని వాపస్‌ తీసుకొని హిందువుల మనోభావాలను, గ్రేవ్‌యార్డుకు కేటాయించిన పది ఎకరాల భూమిని వాపస్‌ తీసుకొని ముస్లింల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీసింది. కరీంనగర్‌ పట్టణంలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా చేశాము. ఈ సారి బ్రహ్మోత్సవాలు చేస్తారా లేదా ప్రకటించడం లేదు. డిసెంబర్‌లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప్రతిపాదిస్తేనే అవి నిర్వహించడానికి అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. టీటీడీ నిధులతో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించేందుకు పది ఎకరాల భూమిని కేటాయించాము.. ఇటీవలే టిటిడి చైర్మన్‌ను కలిశాము.. త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి దేవస్థానం నిర్మాణ పనులను చేపట్టాలని కోరుతామని కమలాకర్‌ అన్నారు. గంగుల కమలాకర్‌పై కోపం ఉంటే వ్యక్తిగతంగా తీర్చుకోండి... అంతేకానీ జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన అన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి జిల్లాకు వచ్చి అభివృద్ధిని సమీక్షించడం లేదు. జిల్లాలో ఉన్న మంత్రులు పట్టించుకోవడం లేదు. ఏడాది కాలం వేచి చూశాం.. ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు.. ఇక మేము కూడా ఈ వివక్షను ప్రశ్నిస్తూ పోరాటం చేపడతాం అని కమలాకర్‌ అన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:49 AM