Share News

జిల్లా నిర్లక్ష్యానికి గురైంది..

ABN , Publish Date - Nov 15 , 2024 | 01:04 AM

గత పదేళ్లలో ఓకే ఒక దిశ సమావేశం జరిగిందని, పెద్దపల్లి ప్రాంతం కొంత నిర్లక్ష్యానికి గురైందని, ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకవస్తానని, ప్రతి మూడు నెలలకోసారి దిశ సమావేశం నిర్వహిస్తామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.

జిల్లా నిర్లక్ష్యానికి గురైంది..

పెద్దపల్లి, నవంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): గత పదేళ్లలో ఓకే ఒక దిశ సమావేశం జరిగిందని, పెద్దపల్లి ప్రాంతం కొంత నిర్లక్ష్యానికి గురైందని, ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకవస్తానని, ప్రతి మూడు నెలలకోసారి దిశ సమావేశం నిర్వహిస్తామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) సమావేశం జరిగింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీ గెలుపొందిన వంశీకృష్ణ తొలిసారిగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. చాలా రోజుల తర్వాత నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రి, ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం, హాజరైన వారిలో ఒక్కరు మినహా ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై పెద్దగా ప్రశ్నించకపోవడంతో వాడీవేడీ లేకుండాపోయింది. మొత్తం 52 శాఖలపై చర్చించాల్సి ఉండగా 3.30 గంటలపాటు 30 శాఖలకు పైగానే సమీక్షించారు. విద్య, వైద్యం, ఉపాధిహామీ, గ్రామీణాభివృద్ధి, విద్యుత్‌, వ్యవసాయ, పంచాయతీరాజ్‌, సంక్షేమం, తదితర శాఖల ద్వారా జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎన్ని నిధులు వచ్చాయి, వాటిని ఏ మేరకు వెచ్చించారు, ఇంకా కేంద్రం నుంచి అదనంగా నిధులు మంజూరుచేయించేందుకు కావాల్సిన ప్రతిపాదనలను అందజేయాలని అధికారులకు ఎంపీ సూచించారు. నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు, గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, రెగ్యులర్‌గా పాఠశాలలను తనిఖీ చేయాలని డీఈవోకు సూచించారు. పీఎంశ్రీ పథకం కింద వచ్చే నిధులను పాఠశాలల నూతన భవనాలు, సైన్స్‌ ల్యాబుల ఏర్పాటుకు పూర్తిగా వినియోగించాలన్నారు. విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో పిల్లల్లో పోషక లోపాలను తగ్గించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. సుల్తానాబాద్‌లో జరిగిన దుర్ఘటనలు మరోమారు జరగకుండా చూడాలని, చైల్డ్‌ సేఫ్టీపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఎంపీ ఆదేశించారు. జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్‌ లేని కుటుంబాలు ఏమైనా ఉంటే వారికి ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద కనెక్షన్‌ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంఎఫ్‌టీకి సంబంధించిన కమిటీని నియమించాలని ఆదేశించారు. పీఎంజీఎస్‌వై, ఉపాఽధిహామీ కింద చేపట్టిన తారురోడ్లు, సిమెంట్‌ రోడ్లు, బ్రిడ్జిల పనులను, జిల్లాలో పెండింగ్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లు అందించాలన్నారు. పరిశ్రమల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలు మొదలగు అంశాలపై గణాంకాలతో పక్కా నివేదిక తయారుచేయాలన్నారు. జిల్లాలో మంజూరైన మంచిర్యాల-వరంగల్‌ జాతీయ రహదారి నిర్మాణ పనులు సకాలంలో పూర్తిచేయాలని, పెండింగ్‌ భూ సేకరణ పూర్తిచేసి జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించాలన్నారు. జిల్లాలో చేపట్టే రోడ్డు మరుమ్మతు పనులు నాణ్యతతో పకడ్బందీగా చేపట్టాలని ఎంపీ సూచించారు. సబ్‌స్టేషన్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని, గృహజ్యోతి పథకం కింద అర్హులైన వారందరికీ 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించాలని, కరెంట్‌ కోతలు లేకుండా చూడాలని, కరెంట్‌ లేని ఇల్లు లేకుండా చూడాలని ఎస్‌ఈని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, కోతల్లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సమావేశం అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఓకే దిశ సమావేశం జరిగిందని, పెద్దపల్లి ప్రాంతం కొంత నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ఈ ప్రాంతానికి నిధులు తీసుకుని వచ్చేవిధంగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశ సమావేశం నిర్వహిస్తామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ పీహెచ్‌సీలు, ఇతర ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేస్తున్నామని ఎంపీకి కలెక్టర్‌ వివరించారు. సమావేశం ఆరంభానికి ముందుకు కలెక్టర్‌ ఎంపీ శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు డి వేణు, అరుణశ్రీ, రామగుండం మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గాజుల లక్ష్మి, కమిటీ మెంబర్లు ఎండీ సజ్జద్‌, గోవర్దన్‌రెడ్డి, వివిధ జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలోకి కాంగ్రెస్‌ నాయకులు..

అధికారికంగా ఎంపీ వంశీకృష్ణ అధ్యక్షతన కలెక్టర్‌ సమావేశ మందిరంలో జరిగిన దిశ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు సమావేశంలో కూర్చోవడం గమనార్హం. సమావేశం ప్రారంభం సందర్భంగా డీఆర్‌డీవో దిశ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మినహా ఇతరులెవరూ సమావేశంలో ఉండకూడదని ప్రకటించారు. అయినా కూడా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు దర్జాగా సమావేశం అయిపోయే వరకు పాత్రికేయుల ముందు వరుసలో కూర్చున్నారు.

Updated Date - Nov 15 , 2024 | 01:04 AM