Share News

తొలిరోజు ప్రశాంతం

ABN , Publish Date - Nov 18 , 2024 | 12:58 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌-3 పరీక్షకు రెండు, మూడు నిమిషాల తేడాతో పలువురు అభ్యర్థులు దూరమయ్యారు. పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 25 కేంద్రాల్లో మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు.

తొలిరోజు ప్రశాంతం
పరీక్షా కేంద్రం వద్ద హాల్‌టికెట్‌లను పరిశీలిస్తున్న సిబ్బంది

- గ్రూప్‌-3 పరీక్షకు 46 శాతం మంది అభ్యర్థులు దూరం

- సకాలంలో చేరుకోలేక అవకాశం కోల్పోయిన పలువురు

- పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహణ

- కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌-3 పరీక్షకు రెండు, మూడు నిమిషాల తేడాతో పలువురు అభ్యర్థులు దూరమయ్యారు. పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 25 కేంద్రాల్లో మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేక కొందరు పరీక్షను కోల్పోయి వెనుదిరిగారు. జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ (144 సెక్షన్‌) అమలు వంటి ఆంక్షలతో నిఘా పెట్టారు. పరీక్ష కేంద్రాలకు 50 మీటర్ల దూరంలో ఎవరినీ గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. హోటళ్లు, జిరాక్స్‌ సెంటర్‌లు మూసివేశారు. క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు.

మొదటి పరీక్షకు 3808 మంది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్‌-3 పరీక్షకు సిరిసిల్ల, వేములవాడ 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో 18 కేంద్రాలు, వేములవాడలో 7 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 5 ప్రభుత్వ పాఠశాలలు, 7 ప్రైవేటు పాఠశాలు, 4 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అగ్రహారం పాల్‌టెక్నిక్‌ కళాశాలు, అగ్రహారం డిగ్రీ కళాశాల, 7 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు 10 రూట్లుగా ఏర్పాటు చేశారు. నిర్వమణలో 25 మంది పరిశీలకులు, 25 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, 25 మంది సూపరింటెండెంట్‌లు, ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలతోపాటు బయోమెట్రిక్‌, ఐడెంటిఫికేషన్‌ కోసం 133 మంది విధులు నిర్వర్తించారు. జిల్లాలో 7062 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కోసం ఏర్పాట్లు చేయగా దాదాపు 46 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొదటి పరీక్షకు 3808 మంది హాజరవగా 3254 మంది గైర్హాజరయ్యారు. రెండో పరీక్షకు 3794 మంది హాజరయ్యారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎస్పీ స్వయంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో పాటు పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు. ఎలక్రానిక్‌ పరికరాలు, సెల్‌ఫోన్‌లు, ఇతర వస్తువులను అనుమతించలేదు. చెప్పులతో వచ్చిన వారిని అనుమతించారు.

పరీక్ష కేంద్రాల కోసం ఇబ్బందులు

సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్‌కు సకాలంలో చేరుకున్నా కేంద్రాలను చేరుకోవడానికి రవాణా సౌకర్యం లేక, ఆటోలు దొరకక అవస్థలు పడ్డారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో కొందరు అభ్యర్థులు ఆలస్యంగా చేరుకొని అనుమతి లభించక వెనుదిరిగారు. గర్భిణులు పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు పరీక్ష రాయడానికి హాల్‌టికెట్‌తోపాటు ఆధార్‌కార్డును గుర్తింపుగా తీసుకొచ్చారు. వివాహమైన తర్వాత ఆధార్‌కార్డులో ఇంటిపేరు మార్చుకోవడంతో పరీక్షా కేంద్రాల వద్ద ఇబ్బందులు పడ్డారు. హాల్‌టికెట్‌లో ఇంటిపేరు ఒకటి ఉండగా, ఆధార్‌లో మరోపేరు ఉండడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

పరీక్ష కేంద్రాల వద్ద పిల్లల సందడి

జిల్లాలో గ్రూప్‌-3 పరీక్ష రాయడానికి వచ్చిన మహిళా అభ్యర్థుల పిల్లలను ఆడించడానికి తండ్రులు, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలు వచ్చారు. కేంద్రాల వద్ద చెట్లకింద పిల్లలను ఆడించడంతో సందడిగా మారింది.

నేడు మూడో పేపర్‌

గ్రూప్‌-3 పరీక్షల నిర్వహణలో భాగంగా తొలిరోజు ఆదివారం రెండు పేపర్‌లు నిర్వహించగా సోమవారం మరో పేపర్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. 9.30 గంటలలోపే పరీక్ష కేంద్రం లోపల ఉండాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించారు. 9.30 గంటలకు గేట్లు మూసి వేయనున్నారు.

Updated Date - Nov 18 , 2024 | 12:58 AM