Share News

సమస్యల వ్యఽథ

ABN , Publish Date - Dec 22 , 2024 | 02:35 AM

గురుకులాలు, హాస్టళ్లలో సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 7 వేల మందికిు పైగా విద్యార్థులు ఉన్నారు. కేజీబీవీల్లో 2800 మందివరకు చదువుకుంటున్నారు.

 సమస్యల వ్యఽథ
హాస్టల్‌లో ఇంటి నుంచి తెచ్చుకున్న రగ్గులు కప్పుకున్న విద్యార్థులు

- గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థుల అవస్థలు

- పనిచేయని హీటర్లు.. చన్నీళ్ల స్నానాలు

- అస్తవ్యస్తంగా మరుగుదొడ్లు, స్నానాల గదులు

- నిర్లక్ష్యానికి నిదర్శనం సంక్షేమం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గురుకులాలు, హాస్టళ్లలో సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 7 వేల మందికిు పైగా విద్యార్థులు ఉన్నారు. కేజీబీవీల్లో 2800 మందివరకు చదువుకుంటున్నారు. గురుకులాలు, హాస్టళ్లలోని పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’ శనివారం విజిట్‌ నిర్వహించింది. సొంత భవనాలు, అద్దెభవనాల్లో కొనసాగుతున్న గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. చలికాలం కావడంతో విద్యార్థులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. కిటీకీలకు డోర్లు లేక ప్లాస్టిక్‌ కవర్లు కట్టుకుంటున్నారు. డైనింగ్‌ హాల్‌లు లేక అరుబయటే భోజనాలు చేస్తున్నారు. మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. దుప్పట్లు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి బృందం హాస్టళ్ల సందర్శనకు వెళ్లినప్పుడు కొన్ని చోట్ల ఎవరినీ అనుమతించవద్దని ఆదేశాలు ఉన్నట్లు హాస్టల్‌ వార్డెన్‌లు, గురుకులాల ప్రిన్సిపాల్‌లు చెప్పారు.

అధ్వానంగా మరుగుదొడ్లు

గంభీరావుపేట : గంభీరావుపేట ఎస్సీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్ల సెఫ్టిక్‌ ట్యాంక్‌లు నిండి అధ్వానంగా మారాయి. మరుగుదొడ్లకు తలపులు లేవు. ఇచ్చిన బెడ్‌ షీట్‌లు పల్చగా ఉండడంతో ఇంటి నుంచి రగ్గులు తెచ్చుకున్నారు. కిటికీలకు దోమ తెరలు లేవు. ఈ ఏడాదికి సంబంధించి బెడ్‌ షీట్లు, స్పోర్ట్స్‌ షూ, స్లిపర్స్‌ రాలేదు. నర్మాల గురుకుల ఆశ్రమ పాఠశాలలో అడవి పందుల బెడద ఉంది. గంభీరావుపేట కస్తూర్బాలో సరిపడా మూత్రశాలలు లేవు. దమ్మన్నపేట మోడల్‌ స్కూల్‌లో దుప్పట్ల సమస్య ఉంది.

నేలపై నిద్రిస్తున్న విద్యార్థులు

ఇల్లంతకుంట: ఇల్లంతకుంటలోని గురుకుల, కస్తూర్బాలో విద్యార్థినులు నేలపై నిద్రిస్తున్నారు. మండ లంలోని బాలికల గురుకుల పాఠశాలలో స్నానాలకు కట్టెల పొయ్యిమీద నీటిని వేడి చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో గాలిపెల్లి వసతి గృహంలో దరవాత్‌ రోహిత్‌ అనే విద్యార్థిని పాముకాటు వేసింది. రాష్ట్ర విద్యాకమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి ఇరువై రోజుల క్రితం హాస్టళ్లను పరిశీలించిన అనంతరం వసతులు మెరుగయ్యాయి.

చన్నీటి స్నానాలు

తంగళ్లపల్లి: మండలంలోని నేరెళ్ల బాలికల గురుకుల పాఠశాల, పద్మనగర్‌ కస్తూర్బా బాలికల పాఠశాలలో వేడినీరు సరిపోక చాలా మంది విద్యార్థులు చన్నీటి స్నానాలు చేస్తున్నారు. బద్దనపల్లి బాలికల గురుకుల పాఠశాల, ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో వేడినీటి సౌకర్యం లేదు. డార్మెంటరీ లేక తరగతి గదిలోనే కాలం వెళ్ల దీస్తున్నారు. విద్యార్ధులకు సరిపడా స్నానాల గదులు, మరుగుదొడ్లు లేవు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో గిరిజన మహిళా డిగ్రీ కళాశాల, బాలికల మైనార్టీ పాఠశాల అద్దె భవనంలో ఇరుకైన గదులతో ఇబ్బందులు పడుతున్నారు.

వేములవాడ రూరల్‌ : మండలంలోని మర్రిపల్లి కస్తూర్బాలో అందరికి సరిపడా వేడినీళ్లు అందుబాటులో లేవు.

స్టడీ చైర్స్‌ లేక అవస్థలు

ముస్తాబాద్‌: మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల నూతన వసతి గృహం ఉన్నా విద్యార్థులకు సరిపోక తరగతి గదిలోనే డార్మెంటరీ ఉపయోగిం చుకుంటున్నారు. సరిపడా కుర్చీలు లేక నేలపై విద్య నభ్యసిస్తున్నారు. పది, తొమ్మిదో తరగతి విద్యార్థులు సొంతంగా స్టడీ చైర్స్‌ను తెచ్చుకున్నారు. కిటీకీలకు దోమ తెరలు లేవు. విద్యార్థులందరికీ వేడి నీటి సౌకర్యం లేదు. రూ.కోటి వ్యయంతో పాఠశాల ఎదుట మైదానంలో వసతి గృహాన్ని నిర్మిస్తున్నారు.

కిటికీలు లేక ఇబ్బందులు

కోనరావుపేట : కోనరావుపేట మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కిటికీలు లేక విద్యార్థులు చలికి ఇబ్బందులు పడుతున్నారు. చన్నీటి స్నానాలు చేస్తున్నారు. ధర్మారం ఎస్సీ హాస్టల్‌లో దుప్పట్లు రాకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకున్నారు. మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలలో చన్నీటితో స్నానాలు చేస్తున్నారు.

49 మందికి రెండు స్నానపు గదులు

చందుర్తి,: చందుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 49 మంది విద్యార్థులకు రెండు స్నానాల గదులు, రెండు మరుగుదొడ్లు మాత్ర మే ఉన్నాయి. మండల కేంద్రంలోని కేజీబీలో డ్రైనేజీ దుర్గంధం వెదజల్లుతోందని విద్యార్థులు పేర్కొన్నారు.

పని చేయని ఫ్యాన్లు

రుద్రంగి: మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహాల్లోని గదుల్లో ఫ్యాన్లు పని చేయడం లేదు. సరిపడా వేడినీరు అందడం లేదు. చన్నీటి స్నానాలు చేస్తున్నారు. కిటికీలకు దోమతెరలు లేవు. హాస్టల్‌ ఆవరణలో భారీగా చెట్లు పెరిగాయి. విద్యుద్దీపాలు లేక చీకటిగా ఉంది. దుప్పట్లు అందలేదు.

చన్నీటి స్నానాలు. నేలపై నిద్ర

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలంలోని మహాత్మాబాఫూలే, ఏకలవ్య రెసిడెన్షియల్‌ పాఠశాలలో విద్యార్థులు చన్నీటి స్నానాలు చేస్తున్నారు. మండలకేంద్రంతోపాటు కేజీబీవీలో తరగతి గదుల్లో నేలపై నిద్రిస్తున్నారు. మహాత్మా జ్యోతిబాపూలే జూనియర్‌, డిగ్రీ కళాశాల అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. పెద్దూర్‌కు కేటాయించిన జూనియర్‌ కళాశాలను ఎల్లారెడ్డిపేటలో నిర్వహిస్తున్నారు. వసతులు లేక తరగతి గదుల్లోనే సామగ్రితో నిద్రిస్తున్నారు. దుప్పట్లు తెచ్చుకున్నారు. కిటికీలకు తలుపులు దోమతెరలు లేవు. డైనింగ్‌ హాల్‌ లేక ఆవరణలో కూర్చొని తింటున్నారు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నారు. సరిపడా మరుగుదొడ్లు, స్నానాల గదులు లేవు. అల్మాస్‌ పూర్‌ కేజీబీవీలో సరిపడా బాత్రూంలు లేక వేకువ జాము నుంచే వరుస కడుతున్నారు. బెడ్స్‌ లేక నేలపై తరగతి గదులు, డైనింగ్‌ హాల్లో నిద్రపోతున్నారు. దుమాల ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారు.

కూరగాయలు వండడం లేదు

వీర్నపల్లి: మండలంలో కేజీబీవీలో కూరగాయలు వండడం లేదు. పప్పు చారుతో కాలం వెల్లదీస్తున్నారు. భోజనంలో నాణ్యత లేదని విద్యార్థులు తెలిపారు. బెడ్లు లేక నేలమీద నిద్రిస్తున్నారు. దుప్పట్లు లేవు. మరుగుదొడ్లు సరిపడా లేవు. చన్నీళ్ల స్నానాలే చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలలో కిటికీలు, వెంటిలేటర్లు లేక కోతులు, దోమలు వస్తున్నాయి. హాస్టల్‌లో సీసీ కెమెరాల మేంటేనెన్స్‌లేదు.

అద్దె భవనాల్లో సమస్యలు

సిరిసిల్ల రూరల్‌: పెద్దూర్‌ శివారులో ఇప్పల్లపల్లి వద్ద మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల అద్దెభవనంలో కొనసాగుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మరుగుడొడ్ల నీరు రోడ్డుపై పారుతోంది. విద్యార్థులు పడుకునే గదులకు గోడలు లేకపోవడంతో చలిలోనే నిద్రిస్తున్నారు. చన్నీటి సాన్నాలు చేస్తున్నారు. సిరిసిల్ల అర్భన్‌ పరిధిలోని చిన్నబోనాలలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రెండు నెలల నుంచి సోలార్‌ హీటర్‌లు పనిచేయడం లేదు. పట్టణంలోని కొత్తబస్టాండ్‌ వద్ద బీసీ వసతి గృహం అద్దెభవనంలో కొనసాగుతోంది. కనీస సౌకర్యాలు లేవు. పట్టణంలోని సుందరయ్యనగర్‌ బాలుర ఎస్సీ హాస్టల్‌లో గీజర్‌ సరిపోవడం లేదు. దుప్పట్లను ఇంటి నుంచి తెచ్చుకున్నారు. బాలికల వసతి గృహంలో గీజర్లు సరిపోక వేడి నిటికి ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాల్లో కామన్‌ మెనూ అమలు కావడం లేదని విద్యార్థులు తెలిపారు.

ఇతరులు లోనికి రావద్దని ఫ్లెక్సీల ఏర్పాటు

వేములవాడ టౌన్‌ : ఇతరులు రావద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తాళాలు వేసిన సంఘటన వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని మహాత్మజ్యోతిబాపూలే బాలుర వసతి గృహంలో చోటు చేసుకుంది. ఆంధ్రజ్యోతి విజిట్‌లో భాగంగా వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని తిప్పాపూర్‌ ఆర్టీసీ డిపో సమీపంలోని వెనుకబడిన బాలుర కళాశాల వసతి గృహాన్ని సందర్శించగా వసతి గృహం ఆవరణలోని పిచ్చి మొక్కలు అన్ని ఎక్ల్సావేటర్‌ సహాయంతో తొలగించారు. వసతిగృహాల్లో సమస్యలు లేవు. విద్యార్థులు నిద్రించే గదుల్లో వెంటిలేటర్లు లేకపోవడంతో చలి ఎక్కువ ఉంటున్నట్లు చెబుతున్నారు.

కలెక్టర్‌ అనుమతి లేకుండా వసతిగృహంలోకి అనుమతి లేదని చందుర్తి మండలంలోని లింగంపేట మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర సంక్షేమ గురుకుల వసతి గృహం ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫోన్‌ ద్వారా ప్రిన్సిపాల్‌ రాజయ్యతో మాట్లాడగా సమస్యలు లేవని తెలిపారు.

వేములవాడ అయ్యప్ప ఆలయం సమీపంలోని తెలంగాణ మైనార్టీ బాలుర రెసిడెన్సియల్‌లోకి అనమతి లేదని ప్రిన్సిపాల్‌ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Updated Date - Dec 22 , 2024 | 02:35 AM