ఉత్సాహంగా అర్బన్ బ్యాంక్ పోలింగ్
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:33 AM
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. గురువారం ఎంతో సందడిగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 2.45 గంటల వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఎంతో ఉత్కంఠతగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది.
- ముగిసిన కౌంటింగ్
- బీఆర్‌ఎస్ ప్యానెల్ అభ్యర్థులదే హవా
- ఎనిమిది మంది డైరెక్టర్ల గెలుపు
- కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల్లో ఒక్కొక్కరు విజయం
- స్వతంత్రులుగా మరో ఇద్దరు
- క్యాంపునకు తరలిన డైరెక్టర్లు
- డైరెక్టర్ల కిడ్నాప్ యత్నం.. చెదరగొట్టిన పోలీసులు
- 6,177 ఓట్లు... 4,760 ఓట్లు పోల్
- నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. గురువారం ఎంతో సందడిగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 2.45 గంటల వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఎంతో ఉత్కంఠతగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. 12 డివిజన్లలో 61 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. నువ్వా నేనా అన్నట్లుగా ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ముమ్మర ప్రయత్నం చేశారు. పోలింగ్ సమయంలో కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఓటింగ్ పూర్తయ్యే వరకు కేంద్రాల వద్ద అభ్యర్థుల మద్దతుదారులు సందడి చేశారు. కౌంటింగ్ పూర్తయి క్యాంపునకు తరలివెళ్లే క్రమంలో డైరెక్టర్లను కిడ్నాప్ చేసే యత్నం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీలు ఝలిపించి చెదరగొట్టడంతో ఉద్రికత్తకు దారి తీసింది. పోలీసులు చెదరగొట్టడంతో పలువురికి స్వల్పంగా దెబ్బలు తగలడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు వివిధ పార్టీల కార్యకర్తలను సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. కౌంటింగ్ సమయంలో నాలుగో వార్డుకు సంబంధించి అడ్డగట్ల మురళికి 190 ఓట్లు, సూరం వినయ్‌కు 186 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు తేడా ఉండడంతో వినయ్ రీకౌంటింగ్ కోరారు. ఆలస్యంగా రీకౌంటింగ్ కోరారనే దానిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు, సహకార అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు రీకౌంటింగ్‌కు ఆమోదించారు. ఒకవైపు రీకౌంటింగ్‌పై ఎన్నికల అధికారి ముందు వాగ్వాదం జరుగుతుండగానే ఫిర్యాదు చేసిన అభ్యర్థి రీకౌంటింగ్‌లో ఓట్లు సరిచూసుకొని సరిగ్గా ఉన్నాయని తెలపడం గమనార్హం. దీంతో అడ్డగట్ల మురళి గెలుపొందినట్లుగా ప్రకటించారు.
ఫ బీఆర్‌ఎస్ ప్యానెల్‌దే హవా...
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ పాలకవర్గంలో మరోసారి పాగా వేయడానికి బీఆర్‌ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులకు మద్దతు పలికింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటోలతో ప్రచారం నిర్వహించారు. అర్బన్ బ్యాంక్ పరిధిలో 12 డివిజన్లలో బీఆర్‌ఎస్ మద్దతు పలికిన అభ్యర్థుల్లో ఎనిమిది మంది గెలుపొందారు. వీరితో పాటు పాటు స్వతంత్రులుగా గెలిచిన వారు కూడా వీరికి మద్దతుగానే ఉన్నట్లుగా తెలిసింది. బీఆర్‌ఎస్ మద్దతుదారుల్లో రాపెల్లి లక్ష్మీనారాయణ, అడ్డగట్ల మురళి, పాటి కుమార్‌రాజు, బుర్ర రాజు, వేముల సుక్కమ్మ, అడ్డగట్ల దేవదాస్, ఎనగందుల శంకర్, కోడం సంజీవ్‌లు గెలుపొందారు. బీజేపీ మద్దతుదారుడిగా పత్తిపాక సురేష్, కాంగ్రెస్ మద్ధతుదారుడుగా చొప్పదండి ప్రమోద్ గెలుపొందారు. స్వతంత్రులుగా గుడ్ల సత్యానందం, వరుస హరిణి గెలుపొందినప్పటికీ బీఆర్‌ఎస్ గూటికే చేరారు. గెలుపొందిన వారిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టెక్స్‌టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ గాజుల నారాయణ, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు అభినందనలు తెలిపారు.
ఫ పోలైన ఓట్లు 4,760..
సిరిసిల్ల అర్బన్ బ్యాంక్‌లోని 12 డివిజన్లలో 6,177 మంది ఓటర్లు ఉండగా 4,760 ఓట్లు పోలయ్యాయి. 77 శాతం పోలింగ్ జరిగింది. 1వ డివిజన్ నుంచి 11 డివిజన్ వరకు 514 ఓట్లు, 12వ డివిజన్‌లో 523 ఓట్లు ఉన్నాయి. వీటిలో ఒకటో డివిజన్‌లో 289 ఓట్లు , రెండో డివిజన్‌లో 327 ఓట్లు, మూడో డివిజన్‌లో 363 ఓట్లు, నాలుగో డివిజన్‌లో 386 ఓట్లు, ఐదో డివిజన్‌లో 351 ఓట్లు, ఆరో డివిజన్‌లో 410 ఓట్లు, ఏడో డివిజన్‌లో 378 ఓట్లు, ఎనిమిదో డివిజన్‌లో 395 ఓట్లు, తొమ్మిదో డివిజన్‌లో 440 ఓట్లు, పదో డివిజన్‌లో 457 ఓట్లు, 11 వ డివిజన్‌లో 477 ఓట్లు, 12వ డివిజన్‌లో 487 ఓట్లు పోలయ్యాయి.
ఫ నేడు చైర్మన్ ఎన్నిక..
సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన డైరెక్టర్ల ఎంపిక పూర్తి కావడంతో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఎన్నికైన డైరెక్టర్లతో సమావేశం నిర్వహించి, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల పక్రియను పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారి రామకృష్ణ, డైరెక్టర్లకు సమావేశానికి రావాలని నోటీసులు జారీ చేశారు. ఎన్నికల పక్రియను జిల్లా సహకార అధికారి బుద్ధనాయుడు పర్యవేక్షించారు.
ఫ చైర్మన్ రేసులో రాపెల్లి లక్ష్మీనారాయణ
సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు మెజార్టీ డైరెక్టర్లుగా గెలవడంతో చైర్మన్ రేసులో రాపెల్లి లక్ష్మీనారాయణ ఉన్నారు. వైస్ చైర్మన్ స్థానానికి మాత్రం పోటీ ఏర్పడింది. మహిళకు అవకాశం ఇవ్వాలనే వాదన ముందుకు వచ్చింది. వైస్ చైర్మన్ కోసం వేముల సుక్కమ్మ, అడ్డగట్ల మురళి, కోడం సంజీవ్‌తో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెంది వ్యక్తికి అవకాశం ఇవ్వాలనే కోణంలో పాటి కుమార్ రాజు కూడా రేసులో ఉన్నారు.