Share News

కనుమరుగైన గోపాల్‌చెరువు

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:07 AM

ఎగువ మధ్యతరగతి, మధ్య తరగతి ప్రజలు పట్టణ జీవితంపై మక్కువ చూపిస్తూ జిల్లాకేంద్రాలకు వలస వస్తుండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. స్మార్ట్‌సిటీగా ఎంపికైన కరీంనగర్‌లో అభివృద్ధి వేగవంతం కావడంతో నగరం చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు కూడా లే అవుట్లుగా మారిపోయాయి.

కనుమరుగైన గోపాల్‌చెరువు
గోపాల్‌ చెరువులో సమ్మక్క సారలమ్మ జాతరకు వినియోగించుకుంటున్న స్థలం

(కరీంనగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఎగువ మధ్యతరగతి, మధ్య తరగతి ప్రజలు పట్టణ జీవితంపై మక్కువ చూపిస్తూ జిల్లాకేంద్రాలకు వలస వస్తుండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. స్మార్ట్‌సిటీగా ఎంపికైన కరీంనగర్‌లో అభివృద్ధి వేగవంతం కావడంతో నగరం చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు కూడా లే అవుట్లుగా మారిపోయాయి. వ్యవసాయం తగ్గడంతో చెరువులు, కుంటల అవసరం తగ్గిన నేపథ్యంలో అధికారంలో ఉన్నవారి దృష్టి, రియల్‌ వ్యాపారుల నజర్‌ చెరువులు, కుంటల భూములపై పడింది. దీంతో వాటి ఆక్రమణలు, అధికారికంగా ఏదో ఒక పేరున ఆ భూములను ఇవ్వడం పెరిగిపోయింది. ఆ క్రమంలోనే కరీంనగర్‌ జిల్లా కేంద్రాన్ని ఆనుకొని బొమ్మకల్‌ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్‌ 728లో ఉన్న గోపాల్‌చెరువు కనుమరుగైంది. 28.10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు నాలుగైదెకరాలకు కుదించుకుపోయింది. చెరువు పారకం కింద బొమ్మకల్‌ నుంచి చేగుర్తి వరకు సుమారు మూడు వందల ఎకరాల్లో రెండు గ్రామాల రైతులు వరిసాగు చేసుకుని జీవించేవారు. చెరువులో నీరు నిలువ ఉండడంతో గ్రామాల్లోనే కాకుండా కరీంనగర్‌లోని వివిధ కాలనీల్లో భూగర్భ జలాలు పెంపొందేవి. చెరువు పరిసరాల్లో ఉన్న వారికి సాగు, తాగునీరు పుష్కలంగా లభించేంది. 2011 వరకు గోపాల్‌చెరువు సజీవంగానే ఉంది. దీనిచుట్టూ క్రమేపీ మధురానగర్‌, హౌసింగ్‌బోర్డుకాలనీ, కృష్ణానగర్‌, బొమ్మకల్‌ బైపాస్‌ రోడ్డు ఏర్పడ్డాయి. ఆయకట్టు పరిధిలో లే అవుట్లతోపాటు వ్యాపార కేంద్రాలు వెలిశాయి. చెరువులోకి వచ్చే వరదను మురుగునీటి కాలువ ద్వారా మళ్లించి చెరువు శిఖాన్ని విలువైన వాణిజ్య భూమిగా మార్చేశారు. ఆక్రమణలు ప్రారంభమయ్యాయి.

ఫ ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా పట్టింపు కరువు

శిఖం భూమి ఆక్రమణలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, చెరువు నాలుగువైపులా కబ్జాలకు గురికాగా ప్రస్తుతం నాలుగైదు ఎకరాలు కూడా భూమి మిగలలేదని, అది కూడా ఆక్రమించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బొమ్మకల్‌ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూకబ్జాదారులు, రాజకీయనాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు గుట్టుచప్పుడు కాకుండా ముందుగా చెరువు శిఖం ఆక్రమించారు, ఆ తర్వాత చెరువు కట్టను చదను చేసి రోడ్డుగా మార్చారు. ఇలా ఆక్రమణలను కొనసాగిస్తూ, చిన్న చిన్న షెడ్ల నిర్మించి గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నంబర్లను తీసుకోవడం, ఆ పక్కనే ఉన్న పట్టాభూముల సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ చెరువులో అధికారికంగా ఎవరికి భూములను కేటాయించకపోయినా శిఖం భూమి మొత్తం మాయమైంది.

ఫ ఇష్టారాజ్యంగా కేటాయింపులు

నిబంధనల మేరకు చెరువు ఫుల్‌ ట్యాంకు లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలను చేపట్టకూడదు. 2011 వరకు ఈ చెరువులో ఎలాంటి నిర్మాణాలు జరుగలేదు. 2014లో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు పదెకరాల భూమిని మురుగునీటి శుద్ధి కేంద్రానికి కేటాయించారు. అప్పటికే చెరువు సమీపంలో సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తుండడంతో గుడితోపాటు జాతర నిర్వహణకు మరో 32 గుంటల స్థలాన్ని కేటాయించారు. చెట్లను పెంచేందుకు తమకు భూమి కేటాయించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) కోరడంతో ఇదే చెరువులో మూడెకరాల భూమి కేటాయించారు. ఆ సంస్థ భూమిని స్వాధీనం చేసుకొని చదను చేసింది. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అనాథ వృద్దుల ఆశ్రమానికి 10 గుంటలు, ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానుల సంఘానికి నాలుగు గుంటల స్థలాన్ని కేటాయించడంతో ఆయా సంస్థల నిర్వహకులు భవనాలను నిర్మించారు. చెరువు శిఖంలోని మధురానగర్‌, హౌసింగ్‌బోర్డు కాలనీ, కృష్ణానగర్‌, బొమ్మకల్‌ బైపాస్‌ ప్రాంతంలో కుల సంఘాల భవనాలు, ఆలయాల నిర్మాణాలు చేపట్టారు. 10 గుంటల భూమిని ఆర్య వైశ్య కర్మకాండ నిలయానికి, మూడెకరాల భూమిని లారీ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌కు పార్కింగ్‌ స్థలానికి కేటాయింంచారు. గోపాల్‌చెరువు బఫర్‌ జోన్‌ పరిధిలోని బొమ్మకల్‌ బైపాస్‌ రోడ్డును ఆనుకొని ఉన్న మిగిలిన భూమి అత్యంత విలువైనవి కావడంతో భారీ భవంతులు, గోదాములను నిర్మించుకున్నారు. స్థానిక నేతల అండదండలతో సమీపంలోని సర్వే నంబర్‌తో ఈ భూమిని కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇళ్లను నిర్మించుకున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని రాజకీయ కారణాలతో తమకు రాజకీయ ప్రయోజనాలు చేకూర్చే సంస్థలకు, వ్యక్తులకు అప్పనంగా కేటాయించారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ విలువైన స్థలంలో ఆశ్రమ పాఠశాలలకు గానీ, ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర ప్రజోపయోగ అవసరాలకు గానీ కేటాయించాల్సి ఉండగా ప్రజాప్రతినిధులు దానిని ఏమ్రాతం పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Oct 02 , 2024 | 01:07 AM