Share News

కుటుంబ సర్వేను బహిష్కరించిన వెంకట్రావుపల్లె గ్రామస్థులు

ABN , Publish Date - Nov 10 , 2024 | 01:14 AM

గ్రామ సరిహద్దులు మార్చే వరకు ఇంటింటి సమగ్ర సర్వేను బహిష్కరిస్తున్నట్లు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి శనివారం సర్వేకు వచ్చిన అధికారులకు వినతిపత్రం అందించారు.

కుటుంబ సర్వేను బహిష్కరించిన వెంకట్రావుపల్లె గ్రామస్థులు
సర్వేను బహిష్కరిస్తున్నట్టు కార్యదర్శికి వినతిపత్రం అందిస్తున్న గ్రామస్థులు

- సరిహద్దులను మార్చాలంటూ కార్యదర్శికి వినతిపత్రం

ఇల్లంతకుంట, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్రామ సరిహద్దులు మార్చే వరకు ఇంటింటి సమగ్ర సర్వేను బహిష్కరిస్తున్నట్లు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి శనివారం సర్వేకు వచ్చిన అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామపంచాయతీ నుంచి 2018లో వెంకట్రావుపల్లె గ్రామపంచాయతీగా ఏర్పడిందన్నారు. గ్రామ సరిహద్దులు, జనాభాను నిర్ణయించారని, దీనిని బట్టి గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. తమకు తెలపకుండా ఆగస్టు 24న ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిందని, కొత్తగా వచ్చిన గెజిట్‌లో వెంకట్రావుపల్లె గ్రామసరిహద్దులు మార్చడమే కాకుండా కొంతమంది ఓటర్లను గొల్లపల్లి గ్రామపంచాయతీలో కలిపారన్నారు. సమస్యను అఽధికారులకు, నాయకులకు విన్నవించామన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామ పాత సరిహద్దులు, కొత్త ఓటర్‌ లిస్టును తయారు చేయాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తాము సర్వేకు సహకరించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు అనగోని మమతయాదగిరి, మంద సుశీలలింగంలతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

సమస్య పరిష్కరిస్తాం..

సర్వేకు సహకరించండి: ఆర్డీవో

సమస్యలు పరిష్కరిస్తాం సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించాలని సిరిసిల్ల ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి సూచించారు. మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామస్థులు ఇంటింటి సర్వేను బహిష్కరించారని తెలుసుకున్న అధికారులు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్నారు. తమ గ్రామసరిహద్దులు మారాయని, కొన్ని ఓట్లు గొల్లపల్లి గ్రామపంచాయతీలో కలుపుతూ ఆగస్టులో గెజిట్‌ వచ్చిందన్నారు. దీనితో ఆర్డీవో ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసువెళ్తామని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందన్నారు. ఆదివారం నుంచి గ్రామానికి వచ్చే ఎన్యూమరేటర్లకు సమాచారం అందిం చి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, తహసీల్దార్‌ ఫారూ ఖ్‌, ఎంపీడీవో శశికళ, వీఆర్వో సింగిరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 01:14 AM