వేతన వెతలు
ABN , Publish Date - Dec 25 , 2024 | 01:26 AM
తహసీల్ధార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లకు వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తొమ్మిది నెలలుగా వేతనాలు అందక వారి కుటుంబాలు ఆర్థికంగా దీనస్థితిలో ఉన్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ఆన్‌లైన్ రికార్డుల నమోదు తదితర సేవలు అందిస్తున్నారు. ఓ ఏజెన్సీ ద్వారా నియామకం అయిన నాటి నుంచి వస్తున్న అరకొర జీతాలతో వీరి జీవితాలు ఆగమ్య గోచరంగానే సాగుతున్నాయి.
జగిత్యాల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తహసీల్ధార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లకు వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తొమ్మిది నెలలుగా వేతనాలు అందక వారి కుటుంబాలు ఆర్థికంగా దీనస్థితిలో ఉన్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ఆన్‌లైన్ రికార్డుల నమోదు తదితర సేవలు అందిస్తున్నారు. ఓ ఏజెన్సీ ద్వారా నియామకం అయిన నాటి నుంచి వస్తున్న అరకొర జీతాలతో వీరి జీవితాలు ఆగమ్య గోచరంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ జీవోలకు అనుగుణంగా వేతనం చెల్లించేలా చూడాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ వర్తింపజేయాలని, ప్రధానంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏజెన్సీల ద్వారా కాకుండా ప్రభుత్వం నేరుగా జీతాలు ఇచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు. జగిత్యాల జిల్లాలో 22 మంది ధరణి ఆపరేటర్లు పనిచేస్తున్నారు.
చాలీచాలని వేతనాలతో అవస్థలు
బీటెక్, ఎంటెక్, నిర్ణీత సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ రంగంలో అనుభవం ఉన్న తమను రెగ్యులర్ చేయాలని ఆపరేటర్లు కోరుతున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2018 మే నుంచి 2021 జూలై వరకు ఒక్కొక్కరికి నెలకు వేతనం 9,980 రూపాయలు చెల్లించారు. 2021 జూన్ నుంచి నెలకు రూ. 11,583 జీతం చెల్లిస్తున్నారు. 2021 జూన్ 15వ తేదీన జారీ అయిన జీవో నంబరు 63 ప్రకారం ధరణి కంప్యూటర్ ఆపరేటర్లుకు నెలకు రూ. 31,040 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
నెలనెలా ఇబ్బందులే..
ధరణి ఆపరేటర్లకు తొమ్మిది నెలలుగా వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. గతంలో రెండు, మూడు నెలలకోసారి వేతనాలు అందాయి. ఫిబ్రవరి 2024 వరకు మాత్రమే వేతనాలు అందాయి. వేతనాల కోసం జిల్లా కార్యాలయాల్లో, సీసీఎల్‌ఏలో, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలను అందిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. భూ రిజిస్త్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయం తీసుకువచ్చే ధరణిలో భాగస్వామ్యమైన తమకు ప్రతినెలా వేతనాలు అందేలా ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.
ప్రతినెలా వేతనం అందేలా చూడాలి
- సురేశ్, జిల్లా ధరణి ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు, జగిత్యాల
ధరణి ఆపరేటర్లకు ప్రతి నెలా వేతనం అందించేలా చూడాలి. తొమ్మిది నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ భారంగా మారింది. అప్పులు తీసుకువచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి వేతనాలు ఇప్పించాలి.
ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి
- చనగాని పురుషోత్తం, తెలంగాణ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్ధార్, ఇతర రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లను రెగ్యులర్ చేయాలి. సమస్యల పరిష్కారానికి ఇటీవల పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులను కలిసి విన్నవించాం. సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.