ఫలించనున్న నిరీక్షణ..
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:31 AM
సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణ కోసం నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న రైతుల కల ఫలించనున్నది. గత ప్రభుత్వ హయాంలో ఆర్‌వోఆర్ చట్టం-2020 ద్వారా తీసుకవచ్చిన ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేసి రూపొందించిన నూతన ఆర్‌వోఆర్ చట్టం తెలంగాణ భూభారతి ద్వారా సాదాబైనామాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
- ధరణి స్థానంలో తెలంగాణ భూభారతి
- సాదాబైనామాలను క్రమబద్ధీకరిస్తామని ప్రకటన
- జిల్లావ్యాప్తంగా పెండింగులో 35,580 దరఖాస్తులు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణ కోసం నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న రైతుల కల ఫలించనున్నది. గత ప్రభుత్వ హయాంలో ఆర్‌వోఆర్ చట్టం-2020 ద్వారా తీసుకవచ్చిన ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేసి రూపొందించిన నూతన ఆర్‌వోఆర్ చట్టం తెలంగాణ భూభారతి ద్వారా సాదాబైనామాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. సాదా బైనామాల ద్వారా భూములను కొనుగోలు చేసి వాటి క్రమబద్ధీకరణ కోసం నాలుగేళ్ల క్రితం చేసుకున్న దరఖాస్తులు పరిష్కారం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్వీకరించిన దరఖాస్తులను మూడేళ్ల పాటు పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలను రైతులు కోల్పోవాల్సి వచ్చింది. తమ అవసరాల కోసం భూములను విక్రయించుకోవాలనుకున్న వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. గత ప్రభుత్వం అమలుచేసిన రైతుబంధు, కేంద్రం అమలుచేస్తున్న ప్రధాని కిసాన్ సమ్మాన్ నిఽధి, ఇతరత్రా సబ్సిడీ పథకాలకు రైతులు నోచుకోవడం లేదు. 2014 జూన్ 2వ తేదీలోపు సాదాబైనామాల ద్వారా భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకోలేని వారి భూములను ఆర్‌వోఆర్ చట్టం ద్వారా ఆ భూములను క్రమబద్ధీకరించి పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసేందుకు ప్రభుత్వం 2020 అక్టోబరు 1 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ తర్వాత నవంబరు 10వ తేదీ వరకు పొడిగించారు. మ్యానువల్‌గా కాకుండా మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 35,580 దరఖాస్తులు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం రూపొందించిన ఆర్‌వోఆర్ చట్టం-2020 ద్వారా అక్టోబరు 24వ తేదీన ధరణి పోర్టల్‌ను తీసుకవచ్చింది. నవంబరు 2వ తేదీ నుంచి ఈ పోర్టల్ అమల్లోకివచ్చింది. సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి రైతులకు ఆ భూములకు హక్కులను కల్పిస్తూ పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయాల్సిన గత ప్రభుత్వం కోర్టులో కేసు కారణంగా పెండింగులో పెట్టింది. కోర్టులో దాఖలైన పిటిషన్‌కు కౌంటర్ పిటిషన్ వేయని కారణంగానే జాప్యం జరిగి దరఖాస్తులు పరిశీలనకు నోచుకోలేదు.
ఫ ప్రయోజనాలకు దూరం..
దరఖాస్తులన్నీ మండల తహసీల్దార్ కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ఆ దరఖాస్తులను పరిశీలించని కారణంగా రైతులు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం ద్వారా వచ్చే సాయం, ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అందే సాయాన్ని కోల్పోతున్నారు. అలాగే రైతుబీమాకు నోచుకోవడం లేదు. బ్యాంకుల ద్వారా వడ్డీ లేని పంట రుణాలను, ఇతరత్రా రుణాలను పొందలేక పోతున్నారు. సాదాబైనామా దరఖాస్తులను ఎప్పుడు పరిశీలిస్తారా అని ఎదురుచూస్తున్న రైతులు రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీయడం ప్రారంభించారు. గత ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించకపోవడంతో భూములను విక్రయించిన పట్టాదారులు, వారి వారసులు అక్కడక్కడ వివాదాలు సృష్టించారు. ఈ భూములు తమవేనని, తాము విక్రయించలేదంటూ తిరగబడుతున్నారని చెబుతున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ధరణి పోర్టల్‌ను ఎత్తివేస్తామని, నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుక వస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ధరణి పోర్టల్‌పై ఒక సబ్ కమిటీని వేసి అధ్యయనం చేయించింది. అందులో ఉన్న లోపాలను సవరించేందుకు పలు సూచనలు చేసింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం ఆర్‌వోఆర్ చట్టం-2020ని ప్రక్షాళన చేసి నూతన ఆర్‌వోఆర్ చట్టం-2024 భూభారతిని తీసుకవచ్చింది. దీనిని అసెంబ్లీలో కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెట్టారు. దీని ద్వారా సాదాబైనామాలను క్రమబద్ధీకరిస్తామని పేర్కొన్నారు. దీంతో పెండింగులో ఉన్న దరఖాస్తులు మరి కొద్ది రోజుల్లో పరిష్కారం కానున్నాయి.