వామ్మో...చలి
ABN , Publish Date - Nov 22 , 2024 | 12:58 AM
వామ్మో... ఇదేమి చలి అంటూ ఎవరి నోట అయినా ఇదే మాట...
కరీంనగర్ టౌన్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): వామ్మో... ఇదేమి చలి అంటూ ఎవరి నోట అయినా ఇదే మాట... గత మూడు, నాలుగు రోజులుగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలితీవ్రత పెరుగుతోంది. దీనితో ఇళ్ల నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, రక్తహీనతతో బాధపడుతున్నవారు, వ్యాధిగ్రస్తులు, మహిళలు చలితీవ్రతను తట్టుకోలేక ఇప్పుడే చలి ఇంతగా ఉంటే మరో రెండు నెలలు మరింత తీవ్రంగా ఉంటుందని భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు చలి, చల్లటి ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోవడంతో చలితీవ్రత పెరిగిందని, మరో మూడు, నాలుగు రోజులపాటు చలితీవ్రత అధికంగా ఉంటుందని తప్పనిసరి అయితే తప్ప ఇళ్లనుంచి బయటకు రావాలని, బయటకు వచ్చే ముందు చలిబారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచి స్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో మైదానాలకు వెళ్లే వాకర్స్, విద్యార్థులు, ఇతర పనులు చేసుకొని జీవించే వారు చలి తీవ్రతను తట్టుకునేందుకు స్వట్టర్లు, తలకు క్యాప్‌లు, రుమాళ్లు, మహిళలు చున్నీలను ధరిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు కూడా రోడ్లపై మంచు కప్పుకోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట మంటతో చలికాగుతూ చలినుంచి ఉపశమనం పొందుతున్నారు. సంక్రాంతి వరకు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెపుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.