రాజన్న ఆలయ దశ మారేనా?
ABN , Publish Date - Nov 08 , 2024 | 01:06 AM
దక్షిణ కాశిగా పిలుస్తున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధిపై భక్తుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
దక్షిణ కాశిగా పిలుస్తున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధిపై భక్తుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వం వేములవాడ రాజన్న క్షేత్ర అభివృద్ధిపై మాటలకే పరిమితమైందని, నామమాత్రలపు పనులతో సరిపెట్టిందనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరడం, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను ప్రభుత్వ విప్‌గా నియమించడంతో దేవస్థానం దశ మారుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం రావడంతోనే బడ్జెట్‌లో దేవస్థానం అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించింది. దీంతోపాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, వేములవాడ దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామని ఇచ్చిన హామీలతో ఈ సారి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతాయని భావిస్తున్నారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలయ అభివృద్ధికి సంబంధించి సూచనలు చేయడం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీఎం ఓఎస్‌డీ శ్రీనివాసులు, రాష్ట్ర దేవాలయ స్థపతి వల్లి నాయగమ్, దేవస్థానం అధికారులు ఆలయ అభివృద్ధి, డిజైన్ల ఖరారుకు సెప్టెంబరులో శృంగేరీ పీఠాధిపతులకు కలిసి చర్చలు జరిపారు.
అభివృద్ధికి నిధుల కోసం ప్రతిపాదనలు
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న అభివృద్ధిలో ముందుకు సాగక భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఆలయ విస్తరణ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. రాజన్న ఆలయ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో వివిధ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించారు. రెండు ప్రాకారాల నిర్మాణాలు, భక్తుల సౌకర్యం కోసం రెండో ధర్మగుండంతోపాటు రూ.32 కోట్లతో అన్నదాన సత్రం, రూ.10 కోట్లతో అసంతృప్తిగా మిగిలిన బ్రిడ్జి పనులు భూ సేకరణకు ప్రత్యేకంగా నిధులు, వంద గదులతో భక్తుల వసతి కోసం భవనం, ఇలా ప్రత్యేకమైన కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. ప్రభుత్వం దగ్గర రూ.100 కోట్ల వరకు వివిద పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులకు సంబంఽధించిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఈ నెలలోనే కార్యక్రమ సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవాదాయ అభివృద్ధి పనులు చేపట్టడంతో ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. వేములవాడ ఆలయ దేవస్థాన విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన డిజైన్లు ఖరారు కావడమే తరువాయిగా భావిస్తున్నారు. ఈ నెలలోనే డిజైన్లు ఖరారుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేములవాడ దేవస్థానానికి సంబంధించిన డిజైన్లు రాజన్న భక్తులను ఆకర్షిస్తున్నాయి. డిజైన్ల ప్రకారం అభివృద్ధి పూర్తయితే మహాక్షేత్రంగా వెలుగొందుతుందని భావిస్తున్నారు.
గత ప్రభుత్వంలో నామమాత్రపు పనులు
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధిపై గత ప్రభుత్వం నామమాత్రపు పనులతో సరిపెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద శైవక్షేత్రంగా ఉన్న రాజన్న దేవస్థానం విస్తరణ అభివృద్ధి పనుల కోసం ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని, 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా 2016లో వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీని నియమించారు. వీటీడీఏ రూ.410 కోట్ల అంచనాలతో 13 పనులకు ప్రతిపాదనలు రూపొందించి పంపింది. దాదాపు ఏడున్నర సంవత్సరాలుగా నామ మాత్రంగానే పనులు చేశారని చెప్పుకోవచ్చు. గుడిచెరువును 35 ఎకరాలు పూడ్చి ఆలయ విస్తరణ కోసం ఏర్పాట్లు చేశారు. చెరువును సైతం మరోవైపు విస్తరించడానికి భూ యజమానులకు రూ.30 కోట్లు చెల్లించారు. వీటీఏడీఏ ద్వారా రూ.77.90 కోట్లు ఖర్చు చేశారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ కోసం చుట్టు పక్క ఇళ్ల యజమానులకు రూ.20 కోట్లు ఖర్చుచేశారు. వీటీడీఏ రాజన్న ఆలయ డిపాజిట్లపై అప్పు తీసుకున్నారు. ట్యాంక్‌బండ్ నిర్మాణం, రిటెయినింగ్ వాల్ నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా ఖర్చు చేశారు. వీటీడీఏ ద్వారా ఇప్పటి వరకు జరిగిన ఖర్చులు, అభివృద్ధి లెక్కలపై కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం.
జిల్లా వ్యాప్తంగా విస్తరించిన వీటీఏడీఏ
వేములవాడ దేవస్థానం అభివృద్ధి కోసం ఏర్పడిన వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేశారు. ఇందుకు సంబంధించిన జీవో అక్టోబరు 26న జారీ చేశారు. వీటీడీఏ పరిధిలోకి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు మండలాలు కూడా చేరాయి. హైదరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీలాగానే జిల్లా అభివృద్ధి పరిధిలో ముందుకు వెళ్తుందని భావిస్తున్నారు.
దేవస్థానం అభివృద్ధికి సంకల్పం
- ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంకల్పంగా భావిస్తోంది. దశల వారీగా ఆలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నాం. బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించడంతోపాటు ఇతర నిధులకు కూడా ప్రతిపాదనలు పంపించాం. దేవస్థానం విస్తరణ పనులు, రోడ్ల విస్తరణ, భక్తులకు వసతి గదులు, అన్నదాన సత్రం, బ్రిడ్జి నిర్మాణం వంటి పనులు దశలవారీగా పూర్తి చేస్తాం. దేవస్థానం అభిృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం.