Jani Master: జానీ మాస్టర్‌పై కేసులో కీలక విషయాలు వెలుగులోకి
ABN , Publish Date - Sep 16 , 2024 | 01:58 PM
ఒక షో కోసం జానీ మాస్టర్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లినప్పుడు బస చేసిన హోటల్లో జానీ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ యువతి ఫిర్యాదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో నమోదయింది. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరింపులు కూడా చేశారని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.
హైదరాబాద్: దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్‌పై (Jani Master) అత్యాచారం కేసు నమోదయిన విషయం తెలిసిందే. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆరోపణలు చేస్తున్న యువతి 2017లో ఓ ఛానల్‌లో ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్‌కు పరిచయమైనట్టు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత జానీ మాస్టర్‌కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఉండాలంటూ ఆయన టీమ్ యువతికి ఫోన్ కాల్ చేశారు. 2019లో జానీ మాస్టర్ టీమ్‌లో సదరు యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది.
ఒక షో కోసం జానీ మాస్టర్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లినప్పుడు బస చేసిన హోటల్లో జానీ అత్యాచారానికి పాల్పడ్డాడని ఎఫ్‌ఐఆర్ ఉంది. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరింపులు కూడా చేశారని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. షూటింగ్ సమయాల్లో కూడా అతడు చెప్పినట్టు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి పేర్కొంది. తరచూ తనపై జానీ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపింది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం చేశాడని ఆమె వివరించింది. వీటికి ఒప్పుకోకపోవడంతో జుట్టు పట్టుకొని జానీ మాస్టర్ దాడి చేశాడని తెలిపింది. ఆగస్టు 28న ఒక వింత పార్శిల్ వచ్చిందని.. పేరు లేకుండా తన ఇంటి తలుపుకు వేలాడదీయబడిందని.. దాని లోపల ‘‘Congratulations for son be care full’’ అని రాసి ఉందని బాధితురాలు వెల్లడించింది.
రాయదుర్గంలో కేసు.. నార్సింగికి బదిలీ
కాగా జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదయింది. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. ఫిర్యాదు చేసిన యువతి వయసు 21 సంవత్సరాలు. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొంది.
కాగా ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు. ఔట్ డోర్ షూటింగులలో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు. గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీమ్‌లో తాను కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నానని యువతి తెలిపింది. చెన్నై, ముంబైలలో ఔట్ డోర్ షూటింగ్స్‌లతో పాటు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటిలో సైతం తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని పేర్కొంది.