Kishan Reddy: కేసీఆర్ బాటలోనే రేవంత్..
ABN , Publish Date - Nov 16 , 2024 | 04:35 AM
‘‘మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నడుస్తున్నారు. హుస్సేన్‌సాగర్ నీటిని కొబ్బరి నీళ్లలా చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఏమీ చేయకుండానే ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు.
అబద్ధాలు, దోపిడీలు.. అదే పాలన
నిరుద్యోగం, ధాన్యం కొనుగోళ్ల సమస్యలు ఇప్పుడు కూడా..
పేదల ఇళ్ల కూల్చివేతను అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తారా?: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నడుస్తున్నారు. హుస్సేన్‌సాగర్ నీటిని కొబ్బరి నీళ్లలా చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఏమీ చేయకుండానే ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. డీపీఆర్ లేకుండానే మూసీ ప్రాజెక్టును పునరుజ్జీవం చేస్తామని ఇప్పుడు రేవంత్ అంటున్నారు. కేసీఆర్ హయాంలో ఉన్న నిరుద్యోగం, ధాన్యం కొనుగోళ్లు వంటి సమస్యలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అబద్ధాలు చెప్పడం.. దోపిడీ చేయడం.. పాలన వైఫల్యం.. అంతా మక్కీకి మక్కీ అన్నట్లుగా కేసీఆర్ పాలనలాగే రేవంత్ పాలన సాగుతోంది. పోలీసు వ్యవస్థను కేసీఆర్ కుటుంబం దుర్వినియోగం చేస్తే.. ఇప్పుడు రేవంత్ కుటుంబం కూడా అదే చేస్తోంది’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
శుక్రవారం టూరిజం ప్లాజాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఇళ్లను కూల్చవద్దంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటారా? అని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా ఇదేనా అని ధ్వజమెత్తారు. పేదల కోసం చావడానికైనా సిద్ధం అని తేల్చిచెప్పారు. మూసీ బాధితులకు ధైర్యం కల్పించేందుకు తామంతా శనివారం రాత్రి వారి ఇళ్లలో బస చేస్తామని తెలిపారు. మూసీ పునరుజ్జీవం జరగాల్సిందేనని, కానీ, పేదల ఇళ్లు మాత్రం కూల్చివేయవద్దన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందనడానికి లగచర్ల ఘటనే ఇదే నిదర్శనం అని విమర్శించారు. అమృత్ పథకం అమలులో అవకతవకలు జరిగితే దర్యాప్తు జరగాల్సిందేనన్నారు. దీనిపై, మాజీ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు జరిగిన ప్రచారంపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ఒక ప్రజాప్రతినిధిగా కలిసి ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎ్‌సను బీజేపీ కాపాడుతోందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై మాట్లాడుతూ.. వారలా ఊహించుకోవడంలో తప్పేం లేదన్నారు.