Kishan Reddy: రైతులపై రేవంత్ చిన్నచూపు
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:01 AM
రైతులు కల్లాల్లో వడ్లు పోసి రెండు నెలలు గడుస్తున్నా.. నేటికీ కొనుగోలు చేయకపోవడం శోచనీయమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి బోటు షికారుపై ఉన్న ధ్యాస..
రెండు నెలలైనా ధాన్యం కొనుగోళ్లు చేపట్టరా?
రైతు హామీలను విస్మరించారు: కిషన్‌రెడ్డి
విద్యా కమిషన్‌లో నక్సల్స్ సానుభూతిపరులు
ఆ కమిషన్‌ను రద్దు చేయాలి: బండి సంజయ్
భూదాన్‌పోచంపల్లి/భగత్‌నగర్ (కరీంనగర్), నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రైతులు కల్లాల్లో వడ్లు పోసి రెండు నెలలు గడుస్తున్నా.. నేటికీ కొనుగోలు చేయకపోవడం శోచనీయమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి బోటు షికారుపై ఉన్న ధ్యాస.. ధాన్యం కొనుగోళ్లపై లేదని ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం గౌసుకొండ, రేవణపల్లి, పోచంపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం కిషన్‌రెడ్డి పరిశీలించారు. రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బోటు షికారు చేసిన సీఎంకు.. రైతుల కష్టాలు చూసే తీరిక లేదా? అని ప్రశ్నించారు. పంటకు గిట్టుబాటు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్.. ఇప్పుడు సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తామంటూ మాట తప్పారని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీ భరోసా, రైతుబంధు లాంటి అనేక వాగ్దానాలను విస్మరించారని అన్నారు. మూసీప్రక్షాళనకు తా ము వ్యతిరేకం కాదని, రేవంత్ విధానాలకు మాత్రమే వ్యతిరేకమన్నారు. పేదల ఇళ్లుకూల్చడం తగదని కిషన్‌రెడ్డి అన్నారు.
రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే: సంజయ్
నక్సలైట్ భావజాలమున్న వారికి విద్యా కమిషన్‌లో చోటు కల్పించడం సిగ్గు చేటని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వెంటనే కమిషన్‌ను రద్దు చేసి, కొత్తది ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లో ఆయన కార్యకర్తలతో కలిసి జితేందర్‌రెడ్డి సినిమాను వీక్షించారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జితేందర్‌రెడ్డి చరిత్రను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపారని అన్నారు. రేవంత్‌రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలపై తెలంగాణలో తిరిగి చెప్పే దమ్ముందా..? అని ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఫాంహౌస్ నుంచి రాని కేసీఆర్.. కేటీఆర్ బావమరిది రేవ్ పార్టీలో దొరికితే మాత్రం డీజీపీకి ఫోన్ చేశారని సంజయ్ విమర్శించారు.