Komatireddy Venkata Reddy: మానవత్వమున్న వారు ‘మూసీ’ని అడ్డుకోరు
ABN , Publish Date - Nov 05 , 2024 | 04:00 AM
మానవత్వం ఉన్నవారెవరూ మూసీ ప్రాజెక్టును అడ్డుకోబోరని, అయినా నల్లగొండ జిల్లా ప్రజలు ఇంకా మూసీ బాధలు ఎన్నాళ్లు పడాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
నల్లగొండ ప్రజలు ఇంకెన్నాళ్లు బాధ పడాలి: కోమటిరెడ్డి
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మానవత్వం ఉన్నవారెవరూ మూసీ ప్రాజెక్టును అడ్డుకోబోరని, అయినా నల్లగొండ జిల్లా ప్రజలు ఇంకా మూసీ బాధలు ఎన్నాళ్లు పడాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మూసీ శుద్ధీకరణ ఆవశ్యకతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈనెల 8న సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మూసీ శుద్ధీకరణపై ప్రతిపక్షాలు ప్రజల్లో సృష్టిస్తున్న గందరగోళానికి తెరదించాల్సిన అవసరముందన్నారు.
దశాబ్దాలుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, కాళ్లు చేతులు వంకరలు, క్యాన్సర్ వంటి జబ్బులతో మరణిస్తున్నా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, బీజేపీలు మూసీ బాధితులను రెచ్చగొట్టి రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్నాయని, ఆ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ క్యాడర్‌ను అప్రమత్తం చేయాలన్నారు. సీఎం పర్యటనలో మల్లన్నసాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు అందించే మంచినీటి సరఫరా పనులకు రూ.210 కోట్లతో శంకుస్థాపన చేస్తారని, ఏర్పాట్లు ఘనంగా చేయాలని సూచించారు.