TG : శాంతించిన కృష్ణమ్మ
ABN , Publish Date - Sep 04 , 2024 | 05:13 AM
ఉగ్రరూపం చూపిన కృష్ణమ్మ శాంతిస్తోంది. రెండు రోజుల పాటు ఉధృతంగా ప్రవహించి మంగళవారం ఉధృతి తగ్గించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉగ్రరూపం చూపిన కృష్ణమ్మ శాంతిస్తోంది. రెండు రోజుల పాటు ఉధృతంగా ప్రవహించి మంగళవారం ఉధృతి తగ్గించింది. దీంతో మంగళవారం ఆలమట్టి జలాశయం గేట్లును మూసివేశారు. ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులు ఉండగా విద్యుదుత్పత్తి ద్వారా 28 వేల క్యూసెక్కులను నారాయణపూర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. 20 వేల క్యూసెక్కుల నీరు చేరుతున్న నారాయణపూర్ నుంచి 8,296 క్యూసెక్కులను జూరాలకు వదులుతున్నారు. జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. 27 గేట్ల ద్వారా 2.07 లక్షల క్యూసెక్కులను విడుస్తున్నారు.
శ్రీశైలానికి 4.77 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 10 గేట్ల ద్వారా 3.56 లక్షల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు 3,37,687 క్యూసెక్కులు వస్తుండగా.. 26 గేట్ల నుంచి 3.16 లక్షల క్యూసెక్కులను దిగువకు పంపుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పడుతోంది. మంగళవారం రాత్రి 10 గంటలకు 6,61,335 క్యూసెక్కులు ప్రవహిస్తోంది. మొత్తం 70 గేట్లను పూర్తిస్థాయికి ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, గేటు మరమ్మతు అనంతరం తుంగభద్ర జలాశయం మళ్లీ నిండనుంది. బుధవారం పూర్తి నీటి మట్టానికి చేరనుంది. 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 15,441 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు.శ్రీరాంసాగర్‌కు వరద కొనసాగుతోంది. మంగళవారం 2.45 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. రెండో రోజూ 41 గేట్లను ఎత్తి ఉంచారు. 2.83 లక్షల క్యూసెక్కులను కిందకు వదిలారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు 34,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.