KTR: డబ్బు వసూళ్ల కోసమే హైడ్రా..
ABN , Publish Date - Oct 17 , 2024 | 04:08 AM
పేదల ఇళ్లుకూల్చి.. బిల్డర్లు, వ్యాపారవేత్తలను భయపెట్టి డబ్బు వసూళ్ల కోసమే రేవంత్ సర్కార్ హైడ్రా తెచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
పేదల ఇళ్లు కూల్చి.. బిల్డర్లను భయపెడుతున్నారు..
రేవంత్‌రెడ్డిది అసమర్థ పాలన
మూసీ సుందరీకరణ వెనుక భారీ స్కాం
పేదలకు మద్దతుగా బీఆర్‌ఎస్ పర్యటనలు
80 వేల కోట్లు ఏమయ్యాయ్?: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్లుకూల్చి.. బిల్డర్లు, వ్యాపారవేత్తలను భయపెట్టి డబ్బు వసూళ్ల కోసమే రేవంత్ సర్కార్ హైడ్రా తెచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పేదలకు తాము అండగా ఉంటామని, క్షేత్రస్థాయిలో పర్యటించి.. బస్తీలు, కాలనీల్లోని వారి భరోసా కల్పిస్తామన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో హైదరాబాద్‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో ఆయన సమావేశమ య్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అక్రమ నిర్మాణమైతే.. నా ఫాంహౌ్‌సను కూల్చేయండి.. ఉన్నవాళ్ల ఇళ్లను కూల్చండి.. తప్ప.. హైడ్రా పేరుతో పేదల ఇళ్లుకూల్చి వారిని రోడ్డుపాలు చేయొద్దు’ అని అన్నారు.
రాష్ట్రం దివాలా తీసిందని ప్రచారం చేస్తూ.. తెలంగాణ పట్ల అందరూ నమ్మకం కోల్పోయేలా.. రేవంత్‌రెడ్డి అసమర్థ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దిక్కుమాలిన పాలనవల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. లక్షన్నర కోట్లతో చేపడుతున్న మూసీ సుందరీకరణ వెనుక భారీ కుంభకోణం ఉందని, దానికోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. నగరంలో చాలాచోట్ల కాంగ్రెస్ హయాంలో అనుమతులిచ్చి.. ఇప్పుడు కూల్చుతున్నారని డిప్యూటీ సీఎం భట్టికి తెలియదా? అని ప్రశ్నించారు.
ఉన్నట్టుండి రేవంత్‌కు దేశరక్షణ గుర్తొచ్చింది
వికారాబాద్ జిల్లాలో రేడార్ స్టేషన్ పనులకు శంకుస్థాపన సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిచేసిన ప్రసంగం ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ అన్నారు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రేనా? లేక బీజేపీలో ఉన్నారా? అర్థం కావడంలేదన్నారు. ఉన్నట్టుండి ఆయనకు దేశరక్షణ గుర్తొచ్చిందని, గతంలో ఆయన ఆర్మీలో ఏమైనా పనిచేశారా? అంటూ ఎద్దేవా చేశారు. రేడార్ స్టేషన్‌తో స్థానికులకు ఒక్క ఉద్యోగం కూడా రాదని.. పర్యావరణానికి నష్టం కలిగించే ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం తగదన్నారు. పర్యావరణ హితం కోసమే.. నేవీ రేడార్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా.. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థలం కేటాయించలేదన్నారు.
ఇదిలా ఉండగా.. కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరు కాలేదు. మరోవైపు.. అధికారం చేపట్టిన పది నెలల్లోనే రేవంత్‌రెడ్డి.. రికార్డు స్థాయిలో రూ.80,500 కోట్ల అప్పులు చేశారని, ఆ డబ్బులను ఏంచేశారని నిలదీశారు. కొత్తగా సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు.. ఎన్నికల హామీలు తీర్చలేదు. తెచ్చిన అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి.. అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.