Share News

KTR: 25 వేల కోట్లు చాలు!

ABN , Publish Date - Oct 19 , 2024 | 04:18 AM

మూసీ బ్యూటిఫికేషన్‌కు గానీ, ప్రక్షాళనకు గానీ, పునరుజ్జీవానికి గానీ తాము వ్యతిరేకం కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మూసీ పేరుతో చేస్తున్న లూటిఫికేషన్‌నే తప్పుబడుతున్నామని చెప్పారు.

KTR: 25 వేల కోట్లు చాలు!

  • మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లు ఎందుకు?

  • బ్యూటిఫికేషన్‌కు మేం వ్యతిరేకం కాదు

  • లూటిఫికేషన్‌నే తప్పుబడుతున్నాం

  • ప్రక్షాళన మొదలుపెట్టింది మేమే

  • వండి పెట్టినం.. వడ్డించడమే రేవంత్‌ పని

  • మూసీపై కేటీఆర్‌ కౌంటర్‌ ప్రజెంటేషన్‌

  • అబద్ధాలే ఆశ్చర్యపోయేలా

  • ముఖ్యమంత్రి రేవంత్‌ మాటలు

  • మూసీ రివర్‌ ఫ్రంట్‌లో దాగి ఉన్న స్టంట్‌ ఏంటి?

  • పునరుజ్జీవం పేరిట రియల్‌ దందా.. ఒప్పుకోం

  • 10 వేల కుటుంబాలకు మేలు జరుగుతుందంటే

  • మూసీ వద్ద 4 నెలలైనా ఉంటా: హరీశ్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మూసీ బ్యూటిఫికేషన్‌కు గానీ, ప్రక్షాళనకు గానీ, పునరుజ్జీవానికి గానీ తాము వ్యతిరేకం కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మూసీ పేరుతో చేస్తున్న లూటిఫికేషన్‌నే తప్పుబడుతున్నామని చెప్పారు. కేవలం రూ.25 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు కోసం రూ.లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ప్రశ్నించారు. 56 కిలోమీటర్ల మేర మూసీ ప్రక్షాళన కోసం కిలోమీటర్‌కు రూ.2700 కోట్ల చొప్పున ఖర్చు పెట్టాలనుకుంటున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన ప్రాజెక్టు అవుతుందేమోనని అభిప్రాయపడ్డారు.


శుక్రవారం తెలంగాణ భవన్‌లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుపై కేటీఆర్‌ కౌంటర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనకు సుందరీకరణ అనే పేరు తాము పెట్టలేదని, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే ఆ మాట అన్నారని తెలిపారు. రూ.లక్షన్నర కోట్ల ఖర్చవుతుందని కూడా ముఖ్యమంత్రే స్వయంగా వెల్లడించారన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. వాస్తవానికి మూసీ ప్రక్షాళనకు తాము ఎప్పుడో శ్రీకారం చుట్టి ఎన్నో పనులు చేపట్టామని కేటీఆర్‌ తెలిపారు. నాలాల ఆధునికీకరణ, ఎస్టీపీల నిర్మాణం చేపట్టామని, బఫర్‌ జోన్‌లోని ఇళ్ల జోలికి పోకుండా నదీ గర్భంలో నివసిస్తున్న వారికి మంచి ప్యాకేజీతో తరలించే ప్రణాళిక చేశామని పేర్కొన్నారు. మూసీపై ఇరువైపులా ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించడం మాత్రమే పెండింగ్‌లో ఉండిపోయిందన్నారు.


  • రియల్‌ ఎస్టేట్‌లా చేస్తున్న రేవంత్‌..

తాము చేపట్టిన ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తే తక్కువ ఖర్చులోనే మూసీలో స్వచ్ఛమైన నీరు పారేలా చేయవచ్చునని కేటీఆర్‌ అన్నారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి ఇవన్నీ వదిలేసి ఒక రియల్‌ ఎస్టేట్‌ తరహా ప్లాన్‌ చేస్తున్నారని విమర్శించారు. దానికోసం రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నందునే తాము అభ్యంతరం తెలుపుతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని, రాహుల్‌గాంధీకి ఎప్పుడు డబ్బులు అవసరమైనా తెలంగాణ గుర్తొస్తుందని ఆరోపించారు. వాళ్లకు డబ్బుల సంచులు మోసేందుకే ఇలాంటి ప్రాజెక్టులు చేపడుతున్నట్లుగా అనిపిస్తోందన్నారు. 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా కాళేశ్వరం ప్రాజెక్టును తాము రూ.లక్ష కోట్లతో కట్టామని, మూసీ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్లిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మూసీ ప్రాజెక్టును ఒకసారి సుందరీకరణ అని, మరో సారి ప్రక్షాళన అని, ఇంకోసారి పునరుజ్జీవం అని సీఎం రేవంత్‌ రోజుకో తీరుగా మాట్లాడుతున్నారని అన్నారు. దానికి అయ్యే ఖర్చును ఒకసారి 50 వేల కోట్లు అని, గజినీలా అది మరిచిపోయి మరోసారి రూ.లక్షన్నర కోట్లు అని అంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మానసిక స్థితిపై తనకు అనుమానంగా ఉందన్నారు.


  • పునరుజ్జీవం పేరుతో గ్రాఫిక్స్‌ వీడియోలు..

మూసీ పునరుజ్జీవం పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి అందమైన గ్రాఫిక్స్‌తో కూడిన వీడియోలు ప్రదర్శించారని కేటీఆర్‌ విమర్శించారు. మూసీకి ఇరువైపులా పెద్ద భవంతులు వస్తున్నట్లు చూపారన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోనే అన్ని బిల్డింగులు వస్తే మరి ప్రత్యేకంగా ఫోర్త్‌ సిటీ కట్టడం ఎందుకని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చేదాకా మూసీ గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు. 2017లో నాటి సీఎం కేసీఆర్‌ మొదటిసారి మూసీ రివర్‌ఫ్రంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నదిని బాగుచేయాలని నిర్ణయించారని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో 31 ఎస్టీపీలు (మురుగు నీటి శుద్ధి కేంద్రాలు) నిర్మించే కార్యక్రమం కూడా తమ హయాంలోనే చేపట్టామన్నారు. తాము శనివారం ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గంలోని ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నామని చెప్పారు.


మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీని ప్రక్షాళన చేసే ప్రణాళికను తమ హయాంలో చేశామని కేటీఆర్‌ తెలిపారు. మూసీపై 15 చోట్ల బ్రిడ్జీలు నిర్మించాలని, ప్రతి బ్రిడ్జి వద్ద ఒక చెక్‌ డ్యామ్‌ నిర్మించి, అక్కడ నిలిచే నీటిలో బోటింగ్‌ ఏర్పాటు చేయాలనుకున్నామని వివరించారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి గ్లోబల్‌ డిజైన్లను ఆహ్వానించి మ్యాపులు రూపొందించామని చెప్పారు. రేవంత్‌ సర్కారు ఇపుడు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదని, తాము చేపట్టిన పనులను కొంచెం ముందుకు తీసుకుపోతే మూసీ ప్రక్షాళన పూర్తవుతుందని అన్నారు. మూసీ కోసం తామే ఇంత చేస్తే.. సీఎం రేవంత్‌ జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. రూ. 50 లక్షలతో దొరికిపోయిన వ్యక్తి తమను టెర్రరిస్టు కసబ్‌తో పోల్చడం దారుణమన్నారు. రిజువనేషన్‌ అనే పదానికి సీఎం రేవంత్‌ తడుముకోకుండా స్పెల్లింగ్‌ చెబితే తాను రూ.50 లక్షలను ఒక బ్యాగులో పెట్టి ఇస్తానని సవాల్‌ విసిరారు.


  • రేవంత్‌-అదాని జోడీని ఏమందాం?: కేటీఆర్‌

సీఎం రేవంత్‌రెడ్డిని ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ కలవడంపై కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో విమర్శలు చేశారు. ‘‘మోదీ, అదానీల దోస్తానాపై ఏఐసీసీ ‘మోదానీ’ అంటూ ట్వీట్‌ చేసిన రోజే తెలంగాణలో అదానీ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ జోడీని ఏమనాలి? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. రేవంత్‌, అదానీ జోడీని రేవ్దానీ అని, రాగా (రాహుల్‌గాంధీ), అదానీ జోడీని రాగదానీ అని అనవచ్చని వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 19 , 2024 | 04:18 AM