Share News

KTR: కోటి అబద్ధాల రేవంత్‌..?

ABN , Publish Date - Dec 06 , 2024 | 03:32 AM

సీఎం రేవంత్‌ రెడ్డిది అబద్ధాల పాలన అని కేటీఆర్‌ మండిపడ్డారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి కానుకలకు కోత పెట్టిన రేవంత్‌ మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారంటూ గురువారం ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR: కోటి అబద్ధాల రేవంత్‌..?

  • నువ్వు ఆడపిల్లలను కోటీశ్వరులను చేస్తావా: కేటీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ రెడ్డిది అబద్ధాల పాలన అని కేటీఆర్‌ మండిపడ్డారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి కానుకలకు కోత పెట్టిన రేవంత్‌ మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారంటూ గురువారం ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మూసీలో ఆడబిడ్డల ఆశల గూడును నేలమట్టం చేస్తున్నావ్‌.. అద్దమరాత్రి ఆడబిడ్డ ఒంటిపై లాఠీ ఝళిపించడమే కాకుండా.. హైడ్రాతో బుచ్చమ్మను పొట్టనపెట్టుకున్నావ్‌.. కోటి అబద్ధాల రేవంత్‌రెడ్డీ నువ్వు ఆడబిడ్డలను కోటిశ్వరులను చేస్తావా? తులం బంగారం అంటూ యువతులను వంచించావు. పేదింటి ఆడబిడ్డల కోసం కేసీఆర్‌ తీసుకొచ్చిన పెళ్లికానుక, గర్భిణుల న్యూటిషన్‌ కిట్‌, బాలింతలకు కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి పథకాలను ఎత్తేసి వారిపట్ల నీ నిర్లక్ష్య వైఖరి ఏంటో తెలియచెప్పావు.


నీ ఏడాదిపాలనతో కోటి రతనాలవీణ తెలంగాణ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే కాకుండా.. సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టావు. నెలకు రూ.2500పేరుతో చెవిలో పూలుపెట్టడంతోపాటు స్కూటీలిస్తానని కాలయాపన చేస్తున్నావు. బతుకమ్మ చీరలను బందుపెట్టిన కారణంగా బతుకమ్మను ఎత్తినచేతులే నీ భరతం పడతాయి.’’ అంటూ కేటీఆర్‌ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. మరోవైపు గురువారం కొచ్చిలో నిర్వహించిన టైకాన్‌ కేరళ అవార్డుల ప్రదానోత్సంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. స్వతహాగా మలయాళీలది కష్టపడేతత్వం అని, ప్రపంచంలో ఎక్కడకెళ్లినా అది అర్థమవుతుందని అన్నారు. ప్రతి విషయంలోనూ రాష్ట్రాల మధ్య పోలికలు అవసరం లేదని, ఆయా రాష్ట్రాలకు తమ బలాలు, ప్రాధాన్యతలున్నాయని చెప్పారు. వాటి ఆధారంగా ముందుకు సాగాలని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - Dec 06 , 2024 | 03:32 AM