Share News

యువరైతు దారుణ హత్య

ABN , Publish Date - Nov 09 , 2024 | 12:03 AM

పంటచేను కాపలాగా వెళ్లిన యువ రైతు దారుణహత్యకు గురైన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.

యువరైతు దారుణ హత్య
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

- డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీంతో దర్యాప్తు

వెల్దండ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): పంటచేను కాపలాగా వెళ్లిన యువ రైతు దారుణహత్యకు గురైన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే... నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలోని ఎంజీ కాలనీ తండాకు చెందిన రాత్లావత్‌ రాజునాయక్‌ (30) తన భార్య హిమబిందుతో కలిసి గురువారం రాత్రి తమ వేరుశనగ పంటకు కాపలాగా వెళ్లారు. ఈ క్రమంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తన భర్త కనిపించకపోవడంతో పక్క పొలంలో ఉన్న రాజునాయక్‌ సోదరుడైన లాలునాయక్‌, అతని భార్య లక్ష్మికి తెలిపింది. వారు ముగ్గురు కలిసి పొలంలో వెతికారు. సమీపంలోనే రాజునాయక్‌ మృతదేహం కనిపించింది. విషయాన్ని తండావాసులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు స మాచారం అందించారు. శుక్రవారం ఉదయం వెల్దండ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ కురుమూర్తిలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి ముఖంపై రాయి, సుత్తి వంటి ఆయుధాలతో కొట్టి హత్య చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీంలతో విచారణ జరిపారు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:03 AM