Share News

అసమగ్ర సర్వే

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:26 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేకు ప్రజల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉంది. అనుకున్న విధంగా సర్వే చేపట్టినా సమయపాలన లేకపోవడం వల్ల మందకొడిగా సాగుతోంది.

అసమగ్ర సర్వే
నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీలో సర్వే తీరును పరిశీలిస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌ సురేష్‌

ఎన్యుమరేటర్ల అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పని ప్రజలు

ఆస్తులు, ప్రభుత్వ పథకాల లబ్ధి వివరాలు చెప్పేందుకు విముఖం

ఆధార్‌ నెంబర్‌తో అన్నీ వస్తాయని సమాధానం చెబుతూ.. దాటవేత

సమగ్ర కుటుంబ సర్వే భయంతో ఉచితాలు పోతాయనే భావన

సమయపాలన సరిగా లేకపోవడంతో నెమ్మదిగా సాగుతున్న సర్వే

మహబూబ్‌నగర్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేకు ప్రజల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉంది. అనుకున్న విధంగా సర్వే చేపట్టినా సమయపాలన లేకపోవడం వల్ల మందకొడిగా సాగుతోంది. ఎన్యుమరేటర్లకు ప్రజలు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అన్ని వివరాలు అందించడంతో పలు ప్రభుత్వ పథకాలకు కొందరు దూరమయ్యారు. మెజారిటీగా ఆస్తుల వివరాలు చెప్పడంతో కుటుంబంలో ఫోర్‌ వీలర్‌ ఉందనే కారణంతో చాలామందికి పింఛన్లు దూరమయ్యాయి. అన్నకు కారు ఉంటే చెల్లెలికి పింఛన్‌ తొలగించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు పథకాలు పోతాయనే భావనతో సర్వేలో వివరాలు సరిగా చెప్పడం లేదు. అలాగే కుటుంబ ఆదాయం వివరాలు కూడా వెల్లడించడం లేదు. సర్వే జరుగుతున్న తీరు, ప్రజల సుముఖతపైన ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో నియోజకవర్గానికి 200 మంది చొప్పున మొత్తం ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 2,600 మందితో సర్వే చేసింది. వారికి నాలుగు ప్రశ్నలను సంధించగా.. సర్వే సరైనది అంటూనే పలు వివరాలు వెల్లడించడం లేదని స్పష్టమైంది.

మందకొడిగా సర్వే..

ఈ నెలాఖరు వరకు సర్వేను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వివరాల సేకరణ జరగడం లేదని తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ప్రజలు సర్వే చేస్తున్న అధికారులకు అందుబాటులోకి రాకపోవడమేనని స్పష్టమవుతోంది. గతంలో సమగ్ర కుటుంబ సర్వేను ఒకే రోజు చేపట్టారు. అప్పుడు అందరూ ఇంటివద్ద అందుబాటులో ఉండాలని ముందుగా సూచించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఆ రోజు సొంత ప్రాంతానికి వచ్చి సర్వేలో పాల్గొనాలని కోరారు. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే మాత్రం భిన్నంగా నడుస్తోంది. ప్రజలకు వీలున్న సమయాల్లో ఎన్యూమరేటర్లకు వివరాలు చెబుతున్నారు. ఎక్కువగా సాయంత్రం సమయాల్లో సర్వే జరుగుతుండగా.. మధ్యాహ్నం, ఉదయం సమయాల్లో మాత్రం ప్రజలు అందుబాటులో ఉండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పొలం పనులకు వెళ్తుండటం, పట్టణాల్లో ఉద్యోగులు, వివిధ వృత్తి పనుల వారు వారి విధులకు వెళ్తుండటం ఎన్యూమరేటర్లకు అడ్డంకిగా మారిందని చెప్పొచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో స్పీడ్‌గా సర్వే నడుస్తుండగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం చాలా నెమ్మదిగా నడుస్తోంది. ఇప్పటివరకు సర్వే ఫారాలను ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో ఎన్యూమరేటర్లు వారి వద్ద లేదా పంచాయతీ అధికారుల వద్ద ఫారాలను నిల్వ చేస్తున్నారు.

ఒక్కో నియోజకవర్గంలో ఒకలా..

ఆంధ్రజ్యోతి సర్వేలో అడిగిన ప్రశ్నలకు ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ప్రజల నుంచి సమాధానాలు వచ్చాయి. సర్వే సరైనదేనా అనే ప్రశ్నకు అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ ప్రజలు సరైనదేనని సమాధానం ఇచ్చారు. కానీ.. ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్నారా? అనే ప్రశ్నకు ఏడు నియోజకవర్గాల్లో సరిగా వెల్లడించడం లేదని మెజారిటీ ప్రజలు తెలుపగా.. ఆరు నియోజకవర్గాల్లో మాత్రం వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ఉచిత పథకాలు కోల్పోతామని భయపడుతున్నారా? అనే ప్రశ్నకు కొడంగల్‌ నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు ఆ భయం ఉందని సమాధానం ఇచ్చారు. సర్వే అనుకున్నట్లు జరుగుతుందా? అనే ప్రశ్నకు ఆరు నియోజకవర్గాల్లో ప్రజలు సరిగా జరగడం లేదని సమాధానం ఇవ్వగా.. ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలు మాత్రం సరిగానే జరుగుతుందని చెప్పారు. అలాగే మెజారిటీ ప్రజలు ప్రతీదానికి ఆధార్‌ నంబర్‌ తీసుకుంటున్నప్పుడు.. ఆ నెంబర్‌ కొడితే ఎవరికి ఏం ఆస్తులు ఉన్నాయో తెలుస్తాయి కదా? అడిగితే చాలామంది తప్పుగా చెప్పే అవకాశం ఉంది కదా అని సర్వేలో పాల్గొన్న ఆంధ్రజ్యోతి ప్రతినిధులను అడిగారు.

కుటుంబ సర్వే చేయడం మంచిదే..

కుటుంబ సర్వే చేయడం మంచిదే కానీ అందులో ఆస్తి వివరాలు అడగడంతో చాలా కష్టంగా ఉంది. మళ్లీ ఆస్తి వివరాలు చెబితే ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా పింఛన్లు, రైతుబంధు, పంట నష్టపరిహారం, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలు రావనే భయం ఉంది. కులగణన వల్ల స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆలోచించడం సరైన మంచి పద్ధతి.

- పెంటమీది నారాయణ, రైతు, మరికల్‌, నారాయణపేట జిల్లా

ఈ సర్వేతో పనిలేదు

గతంలోనే ఇంటింటికి తిరిగి సర్వే చేశారు. మళ్లీ ఈ సర్వేతో పని లేదు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలను అమలు చేయాలి. పెంచిన పింఛన్‌ డబ్బులు ఇవ్వాలి.

- నాగమ్మ, హన్వాడ

Updated Date - Nov 23 , 2024 | 11:26 PM