ప్లాస్టిక్ నిషేధంపై చర్యలేవి?
ABN , Publish Date - Nov 06 , 2024 | 11:12 PM
ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు దృష్టి పెట్టడంలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
- గ్రామాల్లో యథేచ్ఛగా వినియోగం
- పట్టించుకోని అధికారులు, పాలకులు
రాజోలి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు దృష్టి పెట్టడంలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజలు మార్కెట్లో ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా వాటిని ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకెళ్తున్నారు. చివరకు టీ, కాఫీ పార్సిల్ కూడా ప్లాస్టిక్ కవర్లలోనే వాడుతున్నారు. అంటే మనం ప్లాస్టిక్‌ను ఏ స్థాయిలో వినియోగిస్తున్నామో అర్ధమవుతోందిం. ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్ధాం.. అంటూ పాలకులు, అధికారులు గ్రామాల్లో తిరిగి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి హడావుడీ చేశారు. అక్కడక్కడా గోడలపై కొటేషన్లు రాశారు. ప్లాస్టిక్ నిషేధం అంశాన్ని కేవలం పత్రికలు, ఫ్లెక్సీలకు మాత్రమే పరిమితం చేశారు. నాలుగేళ్ల క్రితం కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు మండల కేంద్రంలో ప్లాస్టిక్‌పై నిషేధంపై అవగాహన కల్పించారు. కొన్ని దుకాణాలకు వెళ్లి తనిఖీలు చేసి, 2018 చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయడంతో పాటు జరిమానా విధించారు. ఆ కొద్ది రోజులు మాత్రమే ప్లాస్టిక్‌పై నిషేధం కొనసాగింది. ఆ తర్వాత అధికారులు తనిఖీ చేయకపోవడంతో దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లను యథేచ్ఛగా వాడుతున్నారు. చికెన్, మటన్‌కు సైతం నాణ్యతలేని కవర్లను వినియోగిస్తున్నారు. 51 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను వినియోగించాలని నిబంధన ఉన్నా ఏ ఒక్కరు పాటించడం లేదు. వ్యాపారుల వద్ద ప్లాప్టిక్ అందుబాటులో లేకుండా నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు వినియోగదారులు ఇళ్ల వద్ద నుంచే బ్యాగులను తీసుకొచ్చే విధంగా అధికారులు, ప్రజాపాలకులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.