Share News

కంకర వేసి.. బీటీ మరిచారు

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:12 PM

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సరైన రహదారులు లేవు.

కంకర వేసి.. బీటీ మరిచారు
కంకర పరిచి వదిలేసిన ర్యాలంపాడు రోడ్డు

- జిల్లెలపాడు, సుల్తానాపురం, ర్యాలంపాడు గ్రామాల ప్రజలకు తప్పని తిప్పలు

అలంపూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సరైన రహదారులు లేవు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు కూడా వెళ్లలేని పరిస్థితి. తుంగభద్ర నది అవతలి గ్రామాలైన జిల్లెలపాడు, పులానపురం, ర్యాలంపాడు గ్రామాల గిరి పుత్రులు నిత్యం అవస్థలు పడుతున్నారు. సమస్యను గుర్తించిన అప్పటి ప్రభుత్వం మూడేళ్ల క్రితం రూ.4.60 కోట్ల నిధులు మంజూరు చేయగా, గత్తేదారు పనులు ప్రారంభించి కంకర పరిచారు. కానీ బిల్లులు రాకపోవడంతో వదిలేశారు. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ర్యాలంపాడు నుంచి కేసీ కెనాల్‌ పొడవున ఉన్న రోడ్డు మార్గం గుండా ఆ గ్రామాలకు వెళ్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఏపీలోని నందికొట్కూరు డిపో బస్సులు అడ్డ మార్గంలో వచ్చేవి. ఇప్పుడు ఆ బస్సులు సైతం రావటం లేదు. కనీసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్సులు సైతం వెళ్లడం లేదు. చివరికి ఆంబులెన్సు కూడా ఆ గ్రామాలకు రావటం లేదు. ప్రధానంగా రోడ్డు మార్గం లేక పోవడంతోనే ఈ సమస్య నెలకొంది. రోగులు, గర్భిణుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రాష్ట్రం సిద్ధించినా సమస్య తీరడం లేదని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు రోడ్డు లేకపోవడంతో గ్రామాల వైపు తిరిగి చూడటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బీటీ రోడ్డు వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 05 , 2024 | 11:12 PM