వ్యవసాయ క్షేత్రాలా? నీటి అక్రమ వ్యాపార కేంద్రాలా?
ABN , Publish Date - Nov 05 , 2024 | 11:43 PM
‘ఇవి వ్యవ సాయ క్షేత్రాలా? నీటి అక్రమ వ్యాపార కేంద్రాలా?’ అని క్షేత్రస్థాయిలో విచారణకు వచ్చిన లోకాయుక్త ఇన్వెస్టి గేషన్ అధికారి మ్యాథ్యూకోషి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
- విస్తుపోయిన లోకాయుక్త బృందం
- పోలేపల్లి పరిసరాల్లో క్షేత్ర స్థాయి విచారణ
జడ్చర్ల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ‘ఇవి వ్యవ సాయ క్షేత్రాలా? నీటి అక్రమ వ్యాపార కేంద్రాలా?’ అని క్షేత్రస్థాయిలో విచారణకు వచ్చిన లోకాయుక్త ఇన్వెస్టి గేషన్ అధికారి మ్యాథ్యూకోషి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలంలోని పోలే పల్లి పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లోని బోర్ల నీటిని పంటల సాగుకు కాకుండా, సెజ్‌లోని ఫార్మ పరిశ్రమలకు విక్రయిస్తున్నారని, మరికొందరు వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసి అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నారని పోలేపల్లి గ్రామానికి చెందిన మహేష్, రాఘవేందర్‌లతో పాటు మరికొందరు లోకా యుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాథ్యూకోషి, విచారణ కమిటీ సభ్యులు శివప్రసాద్, రాంరెడ్డిల బృందం మంగళవారం విచారణ చేపట్టింది. పోలేపల్లి పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించింది. ఎకరం భూమి ఉన్న వ్యవ సాయ క్షేత్రంలో మూడు, నాలుగు బోర్లు ఉండడం, ఫాంపాండ్ నిర్మాణాలను గుర్తించారు. వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయలేదని, బోర్ల నుంచి నీటిని ఫాంపాండ్‌లో డంప్ చేస్తున్నారని గుర్తించారు. ఆ నీటిని మోటర్ల సహాయంతో వాటర్ ట్యాంకర్లలో నింపి ఫార్మా పరిశ్రమలకు విక్రయిస్తు న్నట్లు గుర్తించారు. మోటర్‌లకు కమర్షియల్ విద్యుత్‌ను కాకుండా, వ్యవసాయ విద్యుత్‌నే వినియోగిస్తున్నట్లుగా తేల్చారు. దీంతో విద్యుత్‌శాఖకు నష్టం వాటిల్లడమే కాకుండా, భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని బృందం సభ్యులు వెల్లడించారు. ఈ విషయంపై విద్యుత్‌శాఖ అధికారికి ఫోన్ చేసి ప్రశ్నించారు. విద్యుత్ దుర్వినియోగం అవుతోందని, ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. విద్యుత్ శాఖకు అధికారికంగా లేఖను పంపిస్తామని, లోకాయుక్త విచారణకు హాజరు కావాలని సూచించారు. అనంతరం సెజ్‌లోని హెటిరో ఫార్మ పరిశ్రమకు వెళ్లారు. కంపెనీకి అవసరమైన నీటిని ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారని ఆరా తీశారు. పోలేపల్లి మాజీ సర్పంచ్ ఇంటి నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్ ఏర్పాటు చేసుకొని, నీటిని కొనుగోలు చేస్తున్నామని పరిశ్రమల ప్రతినిధులు వారికి తెలిపారు. అంతకుముందు పోలేపల్లి పరిసర ప్రాంతాలలోని వ్యవసాయక్షేత్రాల సర్వే నెంబర్లను జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయ అధికారులతో తీసుకున్నారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను లోకాయుక్తకు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో గిర్దావర్ ఖదీర్‌తో పాటు గ్రామస్థులు, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.