Share News

సమగ్ర సర్వేకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:19 PM

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణతో సమగ్ర ఇంటింటి సర్వేకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

సమగ్ర సర్వేకు సర్వం సిద్ధం
సర్వేపై జరిగిన శిక్షణలో అవగాహన కల్పిస్తున్న అధికారి

- జిల్లాలో 1,55,894 నివాసాలు, 1,193 బ్లాకులు

- 1,170 మంది ఎన్యుమరేటర్లు, 118 మంది సూపర్‌వైజర్ల నియామకం

నారాయణపేట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణతో సమగ్ర ఇంటింటి సర్వేకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, అదనపు కలెక్టర్‌ బెల్‌షాలం ఆధ్వర్యంలో జిల్లా ప్రణాళిక అధికారి ఎస్‌.యోగానంద్‌ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం బుధవారం నుంచి ఇంటిబాట పట్ట నున్నారు. బుధ, గురువారాల్లో రెండు రోజులు ముందు కుటుంబాలను గుర్తిస్తారు. ఆ తర్వాత 56 అంశాలకు సంబంధించి 19 అనుబంధం కలి పి మొత్తం 75 ప్రశ్నలతో సమగ్ర సమాచారం సేకరిస్తారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 280 గ్రామ పంచాయతీలు, మూడు మునిసిపా లిటీలకు గాను జిల్లాలో 1,55,894 నివాసాలు, 1,193 బ్లాకులు ఉన్నాయి. సర్వే కోసం 1,170 మం ది ఎన్యుమరేటర్లు, 118 మంది సూపర్‌వైజర్లకు తోడు పది శాతం అదనపు సిబ్బందితో మొత్తం 1,432 మంది సర్వేలో పాల్గొననున్నారు. గ్రామీణా ప్రాంతాల్లో నివాసాలు 1,31,174 ఉండగా 1,009 బ్లాక్‌లు, 986 మంది ఎన్యుమరేటర్లు, 99 మంది సూపర్‌వైజర్లను నియమించారు. మూడు మునిసిపాలిటీలు కోస్గి, మక్తల్‌, నారాయణపేట పరిధిలో 24,720 నివాసాలకు 184 బ్లాక్‌లు, ఎన్యుమరేటర్లు 184 మంది, 19 మంది సూపర్‌వైజర్లను నియమించి అందరికీ సర్వే ఫారాలు అందించారు. ఎన్యుమరేటర్లను ఎంపీడీవోలు పర్యవేక్షిస్తారు. సేకరించిన సర్వే నివేదికలు ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు 303 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించారు. అందులో 117 మంది ఔట్‌సోర్సింగ్‌ ఆపరేటర్లు, 85 మంది మీసేవా ఆపరేటర్లు, 71 మంది సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్స్‌ నుంచి తీసుకున్నారు. రోజుకు పది ఇళ్లు సర్వే చేసే అవకాశం ఉంటుంది. సర్వే లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్య దర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, వీవోఏ, ఎంఆర్‌సీ సిబ్బంది, జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లను నియమించారు. ప్రతీ మండలానికి ఒక నోడల్‌ అధికారిని నియమించి, పర్యవేక్షించేలా చూడనున్నారు. నారాయణపేట జిల్లా కోడ్‌ 33 ఉండగా మండలాలకు కూడా ఒక కోడ్‌ కేటాయించారు. సర్వే ఫారంలో కోడ్‌ పేర్కొంటారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి

-ఎస్‌.యోగానంద్‌, జిల్లా ప్రణాళిక అధికారి నారాయణపేట.

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, అదనపు కలెక్టర్‌ బెల్‌షాలం ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం సర్వేకు అన్ని ఏర్పాట్లు చేశాం. సర్వేలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం. ఇంటికి వచ్చే సిబ్బందికి కుటుంబ సభ్యులు సమగ్ర సమా చారం అందించి, సహకరించాలి.

Updated Date - Nov 05 , 2024 | 11:19 PM