అంబులెన్సు జాడేది?
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:10 PM
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు మండలంలో అంబులెన్సు (108) అందుబాటులో లేకపోవడంతో పలువురు నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు.
మండలానికి 108 సౌకర్యం కరువు
ఆపదొస్తే ప్రైవేట్ వాహనాలే దిక్కు
అలంపూరు నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు మండలంలో అంబులెన్సు (108) అందుబాటులో లేకపోవడంతో పలువురు నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యవసర పరిస్థితి దృష్యా ప్రతీ మండలంలోని ఆరోగ్య కేంద్రానికి వైద్య ఆరోగ్యశాఖ 108లను కేటాయించింది. కానీ అలంపూరు మండలానికి ఈ వసతి అందని ద్రాక్షలా మిగిలిపోయింది. ఈ క్రమంలో ప్రమాదం జరిగితే పక్కనున్న మండలాల నుంచి 108 రావాల్సిన పరిస్థితి దాపురించింది. లేకుంటే ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో 35వేల జనాభా
మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉండగా దాదాపు 35 వేలకు పైగా జనాభా ఉండగా, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సివిల్ ఆసుపత్రి), క్యాతూరులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఏడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ప్రమాదవశాత్తు ఏదైన ప్రమాదం జరిగిగా, లేదా అనారోగ్య కారణాలతో అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలన్నా 108 సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.