అంగన్‌వాడీ పాఠశాలలను పర్యవేక్షించాలి
ABN , Publish Date - Dec 20 , 2024 | 11:34 PM
అంగన్‌వాడీ(పూర్వ ప్రాథమిక పాఠశాలలు)లను మహిళా, శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్లు తరచుగా పర్యవేక్షించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం తన కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, సూపర్‌వైజర్లతో సమీక్ష నిర్వహించారు.
మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ(పూర్వ ప్రాథమిక పాఠశాలలు)లను మహిళా, శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్లు తరచుగా పర్యవేక్షించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం తన కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, సూపర్‌వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా మార్పు చేసిందన్నారు. ఈ మేరకు ప్ర భుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశించారు. పిల్లలకు ఆట, పాటలతో కూడిన విద్య అందించాలన్నారు. పాఠశాల, పరిసరాల పరిశుభ్రతతో పాటు పిల్లలకు పౌష్ఠికాహారం ఇవ్వాలన్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించడంలో అలసత్వం వహించొద్దన్నారు. బరువు తక్కువగా ఉన్న ఐదేళ్లలోపు పిల్లలను ఎన్‌ఆర్‌సీ సెంటర్‌కు పంపాలన్నారు. సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో లొకేషన్‌తో వచ్చే ఫొటోలను అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఫీల్డ్‌లో ఒక్క సూపర్‌వైజర్ కూడా కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణుల ఇంటికి వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితిని అప్‌లోడ్ చేయాలని చెప్పారు. కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, టైమ్ టేబుల్, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, మండలానికి ఒక సెంటర్‌ను మోడల్‌గా తీర్చిదిద్దాలని తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద న్యూట్రీ గార్డెన్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం తదితరులు పాల్గొన్నారు.