Share News

వరుస చోరీలతో బెంబేలు

ABN , Publish Date - Nov 03 , 2024 | 10:56 PM

మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

 వరుస చోరీలతో బెంబేలు
ధరూరు మండల కేంద్రంలో చోరీ జరిగిన ప్రదేశంలో క్లూస్‌ టీం పరిశీలన (ఫైల్‌)

- ఇళ్లతో పాటు కిరాణ డబ్బాలకు కన్నాలు

- పోలీసుల నిఘా కరువు

ధరూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) :మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కిరాణ డబ్బాలతో పాటు వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కేబుల్‌ వైర్లు, ఎద్దులు, ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు దొంగతనాలకు పాల్పడుతుండటంతో ప్రజలు, వ్యాపారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. శుభ కార్యాలయాలకు, ఇతర పనుల నిమిత్తం ఇళ్లకు తాళాలు వేసి తిరిగి వచ్చేలోపు చోరీలు జరుగుతుండటంతో భయాందోళన చెందుతున్నారు. సంవత్సర కాలంగా వివిధ రకాల చోరీలు జరుగుతున్నా వాటి పరిష్కారంలో ఎలాంటి పురోగతి కనపడం లేదని ఆయా గ్రామాల, ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ఆరు నెలల క్రితం మండలంలోని జాంపల్లి కాల్వ సమీపంలో నెట్టెంపాడు ప్రధాన కాల్వ వెంట ఉన్న మోటార్లకు అమర్చిన కేబుల్‌ వైర్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. స్టాటర్ల నుంచి కాల్వలో ఉన్న మోటార్లకు ఉన్న కేబుల్‌ను దొంగలు అపహరిస్తున్నారు. ఇలా రెండు, మూడు నెలలకోసారి వైర్లను అపహరించుకుపోవడంతో ఎంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి పురోగతి లేదని వారంటున్నారు.

దిచక్ర వాహనాలే లక్ష్యంగా ధరూరు మండల కేంద్రంలో గత 15 రోజుల క్రితం ఇంటి ముందు ఉంచిన ద్వచక్రవాహనాన్ని అర్ధరాత్రి దుండగులు అపహరించుకు పోవడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ చేసిన వాహనాలను కర్ణాటక, ఆంధ్రా సరిహద్దులను దాటించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

పాఠశాలల్లో సైతం వదలని దొంగలు

ధరూరు మండలంలోని పలు పాఠశాలల్లో గతంలో వచ్చిన వరుస సెలవుల కారణంగా గుర్తు తెలియని దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. గత నాలుగు నెలల క్రితం మాన్నాపురం పాఠశాలలో వంటి గది తాళాలు పగులగొట్టి నిల్వ ఉంచిన సరుకులు చోరీ చేశారు. వేసవి సెలవుల్లో తరగతి గదుల తాళాలు పగులగొట్టి ఫ్యాన్లను చోరీ చేశారు.

రాత్రివేళ గస్తీ నిర్వహిస్తున్నాం

మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సిబ్బందితో రాత్రివేళలో గస్తీ నిర్వహిస్తున్నాం. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. గతంలో ఎద్దుల దొంగతం కేసులో నిందితులను రిమాండ్‌కు పంపించాము. ప్రజలు నిర్భయంగా తమకు ఫిర్యాదులు ఇస్తే వాటి ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు కృషి చేస్తాం.

- అబ్దుల్‌ షుకూర్‌, ధరూరు ఎస్‌ఐ

Updated Date - Nov 03 , 2024 | 10:56 PM