Share News

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి పర్యటన.. జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ..

ABN , Publish Date - Jul 28 , 2024 | 09:04 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తిలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్‌లో కల్వకుర్తికి బయలుదేరి వెళతారు. సాయంత్రం ఐదున్నర వరకు కల్వకుర్తిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో జైపాల్ రెడ్డి సంస్మరణ సభ జరగనుంది.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి పర్యటన.. జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ..

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District), కల్వకుర్తి (Kalwakurti)లో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్‌లో కల్వకుర్తికి బయలుదేరి వెళతారు. సాయంత్రం ఐదున్నర వరకు కల్వకుర్తిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ (BSNL) ప్రాంగణంలో జైపాల్ రెడ్డి (Jaipal Reddy) సంస్మరణ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అలాగే శ్రీశైలం హైవేలోని కొట్ర సర్కిల్ వద్ద కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు.


కాగా కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం కల్వకుర్తిలోని ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. వెల్దండ మండలం, కొట్ర గేటు వద్ద హైదరాబాద్‌ – శ్రీశైలం జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు. అంతకుముందు బీఎస్‌ఎన్‌ఎల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభకు దాదాపు 25 వేల మందిని సమీకరించేందుకు కాంగ్రెస్‌ సన్నాహాలు చేస్తోంది. కాగా, ఆదివారం ఉదయం హైదరాబాద్‌, నెక్లెస్‌ రోడ్‌లోని జైపాల్‌రెడ్డి స్మారక స్థలిలో ఆయనకు నివాళిని అర్పించనున్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత గడ్డ కల్వకుర్తికి ఆదివారం రానున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు పలు ఆశలు పెట్టుకున్నారు. కేఎల్‌ఐ డీ-82 కాల్వతో పాటు సబ్‌ కెనాల్స్‌ పూర్తి, పెండింగ్‌ భూ నష్ట పరిహారం మంజూరుతో పాటు వంద పడకల ఆస్పత్రి మంజూరు చేస్తారని ఆశిస్తున్నారు.


దాదాపు పూర్తయిన కేఎల్‌ఐ డీ-82 కాల్వ

కల్వకుర్తి ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు నీరు అందించడానికి కేఎల్‌ఐని రూపొందించారు. కేఎల్‌ఐ 29వ ప్యాకేజీలో భాగంగా కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి వరకు 160 కిలో మీటర్లు ప్రధాన కాల్వ పూర్తయ్యింది. ఈ కాల్వ మాడ్గుల మండలం నాగిళ్ల వరకు తవ్వాల్సి ఉండగా అక్కడే పనులు ఆగిపోయాయి. అక్కడి నుంచి కాల్వను కొనసాగించేందుకు డీ-82 పేరుతో రూ.179 కోట్లు మంజూరు చేశారు. 59.05 కిలో మీటర్ల ఈ కాల్వను తవ్వాలి. వెల్దండ మండలం చెరుకూరు వద్ద గతంలో టేకు తోట వల్ల ఈ కాల్వ పనులు ఆగిపోగా, ఆ తోటకు పరిహారం చెల్లించి, ఇబ్బందులను తొలగించారు. కాల్వ పనులు 95 శాతం పూర్తయ్యాయి. కానీ ఆమనగల్లు మండలం సింగంపల్లి వద్ద పరిహారం రాకపోవడంతో రైతులు పనులను గతంలో అడ్డుకున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి రైతులతో శనివారం మాట్లాడి పనులు చేపట్టారు. కేఎల్‌ఐ డీ-82 కింద మొత్తం 58,789 ఎకరాలకు నీరందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 28,150 ఎకరాలకు నీరందుతోంది. నాగిళ్ల వరకు కాల్వ పూర్తయితే పూర్తి స్థాయిలో నీరందనుంది.


అందని పరిహారం

కేఎల్‌ఐ డీ-82లో భాగంగా రూ.80 కోట్ల భూ నష్ట పరిహారం పెండింగ్‌లో ఉంది. 254 ఎకరాలకు గాను రూ.20 కోట్లకు టోకెన్‌ను రైతులకు సిద్ధం చేయగా, అకౌంట్లలో డబ్బులు జమ కావాల్సి ఉంది. కాగా, మరో 300 ఎకరాలకు సంబంధించి సుమారు రూ.60 కోట్లకు ప్రతిపాదనలు పంపినా రాలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ పరిహారాన్ని మంజూరు చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.


వంద పడకల ఆస్పత్రి కోసం విజ్ఞప్తి

మూడు జాతీయ రహదారుల కూడలిగా ఉన్న కల్వకుర్తికి వంద పడకల ఆస్పత్రి మంజూరు చేయాలని సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ట్రామా కేర్‌ సెంటర్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యా పరంగా ఇంజనీరింగ్‌ కళాశాలతో పాటు పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు చేస్తారని ఆశిస్తున్నారు. అదే విధంగా ఆమనగల్లులో 50 పడకల ఆస్పత్రి నిర్మించాలని, పాలిటెక్నిక్‌ కళాశాల పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.


తుక్కుగూడ నుంచి కల్వకుర్తి వరకు ఆరులేన్ల రోడ్డు

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వరకు జాతీయ రహదారి మూడు లేన్లు ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచ కల్వకుర్తి వరకు ఆరు లేన్ల రోడ్డును కేంద్రంతో మాట్లడి మంజూరు చేయించాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

జగన్‌ ధ్వంస రచన.. అబద్ధాలే ఆలంబన!

పదేళ్లలో ఏపీ అగ్రగామి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 28 , 2024 | 09:04 AM