Share News

జనరల్‌ ఆస్పత్రిపై కలెక్టర్‌ నజర్‌

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:34 PM

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిపై జిల్లా కలెక్టర్‌ విజయేందిర బోయి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆస్పత్రిలో రోగులకు సకాలంలో వైద్యసేవలు అందడంతో పాటు, శానిటేషన్‌ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జాయింట్‌ కలెక్టర్‌ శివేంద్రప్రతా్‌పకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

జనరల్‌ ఆస్పత్రిపై కలెక్టర్‌ నజర్‌
ప్రభుత్వ ఆస్పత్రి

జాయింట్‌ కలెక్టర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు

శానిటేషన్‌ పర్యవేక్షణ అధికారులుగా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు

సూపర్‌వైజర్ల వ్యవస్థ తొలగింపు

వాట్సాప్‌ గ్రూపు ద్వారా రోజూ పర్యవేక్షణ

కలెక్టర్‌ చొరవతో మెరుగుపడిన పరిశుభ్రత

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిపై జిల్లా కలెక్టర్‌ విజయేందిర బోయి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆస్పత్రిలో రోగులకు సకాలంలో వైద్యసేవలు అందడంతో పాటు, శానిటేషన్‌ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జాయింట్‌ కలెక్టర్‌ శివేంద్రప్రతా్‌పకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీని పర్యవేక్షించేందుకు హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. ఇదివరకు శానిటేషన్‌ ఏజెన్సీలో ఉన్న సూపర్‌వైజర్ల వ్యవస్థను పూర్తిగా తొలగింపజేశారు. శానిటేషన్‌ వర్కర్ల పనితీరు, పరిసరాలు, వార్డుల పరిశుభ్రతను రోజూ పర్యవేక్షించేందుకు ఒక వాట్సాప్‌ గ్రూపును కూడా ఏర్పాటు చేశారు. తద్వారా ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు కలెక్టర్‌ కంకణం కట్టుకున్నారు.

- మహబూబ్‌నగర్‌ వైద్యవిభాగం, (ఆంధ్రజ్యోతి)

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్ప్రతిని బాగు చేసేందుకు కలెక్టర్‌ చొరవ తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో శానిటేషన్‌ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారిందని, టెండరు దక్కించుకున్న ఏజెన్సీ నిర్వాహకులు తక్కువ మందిని నియమించి ఎక్కువ మంది ఉన్నట్లు బిల్లులు తీసుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో బిల్లులు తీసుకోవడం తప్ప పని చేయడం లేదని గ్రహించిన కలెక్టర్‌ ఆస్పత్రిపై నజర్‌ పెట్టారు. ఈమేరకు ఈనెల 18న ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సందర్భంగా శానిటేషన్‌ వ్యవస్థ అధ్వానంగా ఉందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఇన్‌చార్జిగా అదనపు కలెక్టర్‌ శివేంద్రపతా్‌పకు బాధ్యతలు అప్పగించారు. రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయా?, డాక్టర్లు సకాలంలో వస్తున్నారా?, శానిటేషన్‌ వ్యవస్థ ఎలా కొనసాగుతుందనే అంశాలను పర్యవేక్షించేందుకు ఆయనకు బాధ్యతలు అప్పజెప్పారు. ఆస్పత్రిని సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు.

సూపర్‌వైజర్ల తొలగింపు

శ్రీసాయి ఏజెన్సీ నిర్వాహకులు ఆస్పత్రిలో శానిటేషన్‌ను పర్యవేక్షించేందుకు 15 మంది వరకు సూపర్‌వైజర్లను నియమించారు. అయితే వీరు కూడా ఏజెన్సీకి చెందిన వారే కావడంతో తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది చూపిస్తున్నారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. దాంతో ఆ సూపర్‌వైజర్లను తొలగించి, శానిటేషన్‌ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ఒక సీహెచ్‌వో, ఆయన కింది స్థాయి అధికారులు హెల్త్‌ ఇన్స్‌పెక్టర్లకు కలెక్టర్‌ బాధ్యతలు అప్పజెప్పారు. వారు రోజూ స్వయంగా ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో తిరిగి, ఎక్కడ అఽధ్వానంగా ఉందో తెలుసుకొని కార్మికులతో పని చేయించుకోవాలని చెప్పారు.

వాట్సాప్‌ గ్రూపు ద్వారా పర్యవేక్షణ

ఆస్పత్రిలో శానిటేషన్‌ కోసం కలెక్టర్‌ ఒక వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేయించారు. రోజూ వార్డుల్లో శుభ్రత, పరిశుభ్రత, కార్మికుల హాజరు వంటి అంశాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ రోజు వార్డుల పొటోలు, పని చేస్తున్న వారి వివరాలను హెల్త్‌ ఇన్‌స్పెక్టర్ల ద్వారా గ్రూపులో అప్‌లోడ్‌ చేయిస్తున్నారు. ఏదైనా పొరపాట్లు ఉంటే ఆ గ్రూపులోనే సలహాలు, సూచనలు చేస్తున్నారు. శానిటేషన్‌ కార్మికుల హాజరు కోసం బయోమెట్రిక్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయించారు. బయోమెట్రిక్‌ హాజరు ద్వారానే వారికి బిల్లులు చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్‌ చొరవతో ఆస్పత్రి అభివృద్ధి

జనరల్‌ ఆస్పత్రి అభివృద్ధి కోసం కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. శానిటేషన్‌ వ్యవహారం మాకు భారంగా ఉండేది. దాంతో ఆస్పత్రికి చాలా చెడ్డపేరు వస్తోంది. అందుకే కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి పరిసరాలు, వార్డులు, విభాగాలు చాలా పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో డాక్టర్ల పనితీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలను కూడా కలెక్టర్‌ పర్యవేక్షించనున్నారు.

- డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Updated Date - Oct 22 , 2024 | 11:34 PM