పంట నష్టాన్ని అంచనా వేయాలి
ABN , Publish Date - Apr 02 , 2024 | 11:03 PM
వర్షాభావంతో దెబ్బ తిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని, ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని గద్వాల, అలంపూర్ ఎమ్మె ల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు కోరారు.
- ఎకరానికి రూ. 25 వేల పరిహారం ఇవ్వాలి
- ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు
- కలెక్టర్ బీఎం సంతోష్‌కు వినతిపత్రం
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 2 : వర్షాభావంతో దెబ్బ తిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని, ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని గద్వాల, అలంపూర్ ఎమ్మె ల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు కోరారు. మంగళవారం వారు కలెక్టర్ బీఎం సంతోష్‌ను కలిసి సమస్యను వివరించి, వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిహారంతో పాటు ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ. 500 చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో నీరందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గ్రామాల వారీగా పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారుల బృందాలను నియమించి, యుద్ధప్రాతిపదికన నివేదికలు తెప్పించుకోవాలని కోరారు. వరితో పాటు ఇతర పంటలకు మద్దతు ధర అదనంగా ఇప్పించాలన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. యాసంగి పంటలకు బోనస్ చెల్లించేలా, వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీలు ప్రతాప్‌గౌడు, విజయ్, రాజారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్, ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.