తగ్గిన దిగుబడి - పెరిగిన ధర
ABN , Publish Date - Nov 12 , 2024 | 11:25 PM
ఈ ఏడాది ఉల్లి దిగుబడి తగ్గింది. ధర మాత్రం గత సంవత్సరం కన్నా కొంత పెరిగింది.
- గత ఏడాది కన్నా తగ్గిన ఉల్లి సాగు
- అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట
- మార్కెట్లో గతం కంటే పెరిగిన ధర
- రైతులకు ఉపశమనం
ఉండవల్లి, నవంబరు 12 (ఆంధ్యజ్యోతి) : ఈ ఏడాది ఉల్లి దిగుబడి తగ్గింది. ధర మాత్రం గత సంవత్సరం కన్నా కొంత పెరిగింది. దీంతో రైతుల పరిస్థితి కొంత ఖేదం.. కొంత మోదం అన్నట్లుగా ఉంది. గత రెండేళ్లు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఉల్లి సాగు చేసిన రైతులు నష్టాలను మూటకట్టుకున్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంటుందేమోనన్న సందేహంతో ఎక్కువ మంది రైతులు ఉల్లి సాగుకు ఆసక్తి చూపలేదు. దీంతో సాగు విస్తీర్ణం తగ్గింది. దీనికి తోడు అధిక వర్షాలు కురవడంతో వేసిన పంట చాలా వరకు దెబ్బతిన్నది. దీంతో దిగు బడి కూడా గతం కంటే తగ్గింది.
తగ్గిన సాగు విస్తీర్ణం
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది 1,251 మంది రైతులు 2012 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. అత్యధికంగా అలంపూర్ మండ లంలో 806, మానవపాడు మండలంలో 226 ఎకరాల్లో సాగయ్యింది. ఉండవల్లి మండలంలో గత ఏడాది 423 మంది రైతులు 745 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశారు. ఎకరాకు దాదాపు 35 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. కానీ సరైన ధర రాకపోవడంతో రైతులు నష్టపోయారు. ఈ ఏడాది 398 మంది రైతులు 665 ఎకరాల్లో మాత్రమే ఉల్లి సాగు చేశారు. పంట చేతికి అందే సమయంలో అధిక వర్షాలు కురవడంలో తెగులు ఆశించి దిగుబడి తగ్గిపోయింది. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చింది. సాగు ఖర్చు ఎకరానికి 50 వేలకు పైగా అయ్యిందని రైతులు చెప్తున్నారు. అయితే గత ఏడాది రూ. 2,500 నుంచి మూడు వేల రూపాయల వరకు ధర పలికింది. అది కూడా కొద్ది రోజులు మా త్రమే కొనసాగింది. ఈ ఏడాది నెల రోజులుగా స్థిరంగా ఉంటోంది. కనిష్ఠం రెండు వేల రూపా యల నుంచి గరిష్ఠం నాలుగు వేల రూపా యల వరకు ధర పలుకుతోంది. ఉల్లి సాగు ఖర్చు, పెట్టుబడి ఎక్కువైనా, వచ్చిన దిగుబడికి మంచి ధర పలుకుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమ్ముకునేందుకూ అవస్థలు
ఆరు గాలం కష్టపడి ఉల్లి సాగు చేసినా, వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు రైతులు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో వ్యాపారులు అలంపూర్ చౌరస్తాలో ఉల్లి కొను గోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ లావా దేవీలకు ఆసక్తి చూపకపోవడంతో కొనుగోలు కేంద్రాన్ని ఎత్తేశారు. దీంతో ఉల్లిగడ్డలను విక్రయించేందుకు కర్నూలు లేదా చిలకలూరిపేట మార్కెట్లకు వెళ్లాల్సి వస్తోంది. ఆయా ప్రాంతా ల్లోనూ ఉల్లి సాగు అధికంగా ఉండటం, మా ర్కెట్‌కు అధిక దిగుబడులు వస్తుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కర్నూలు మార్కెట్‌కు ఉల్లిగడ్డలు అత్యధికంగా రావడంతో మార్కెట్లో స్థలం సరిపోలేదు. దీంతో ట్రాక్టర్లను గంటల తరబడి రోడ్లపైనే నిలిపి వేశారు. దీంతో రైతులు ఇబ్బంది పడ్డారు.
మంచి ధర పలికింది
జి. రఘునాథ్ రెడ్డి, రైతు, ఉండవల్లి : మూడు సంవత్సరాలుగా ఉల్లి పంటను సాగు చేస్తున్నాను. ఈ ఏడాది రెండు ఎక రాల్లోసాగు చేయగా, మొత్తం 75 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గడ్డ నాణ్యంగా ఉండ టంతో కర్నూలు మార్కెట్‌కు తీసుకెళ్లగా క్వింటాలుకు రూ. 3800 చొప్పున ధర లభించింది. అధిక వర్షాలతో కొంత ఇబ్బంది పడినా, మార్కెట్లో మంచి ధర పలకడంతో ఉపశమనం కలిగింది.
అధిక వర్షాలతో తెగులు
లింగస్వామి, రైతు, ఉండవల్లి : నేను ఈ ఏడాది 2.30 ఎకరాలల్లో ఉల్లి పంటను సాగు చేశాను. మొదట్లో బాగానే ఉన్నా, ఆ తర్వాత అధిక వర్షాలు కురవడంతో సగం పంట మురిగిపోయింది. కొంత కోతకు గుర ు్యుంది. అదే సమయంలో మజ్జిగ తెగులు ఆశించడంతో దిగుబడి తక్కువగా వచ్చింది. 100 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని ఆశిం చగా, 67 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. కానీ మార్కెట్లో రూ.3,960కి అమ్మడంతో పెట్టుబడి పోను ఇరవై వేల రూపాయలు మిగలడంతో ఉపశమనం కలిగింది.