Share News

మన్మోహన్‌సింగ్‌ రాకతో దశ మారిన ధర్మాపూర్‌

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:17 PM

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాకతో పాలమూరు జిల్లాలోని ధర్మాపూర్‌ గ్రామం దశ మారిపోయింది.

మన్మోహన్‌సింగ్‌  రాకతో దశ మారిన ధర్మాపూర్‌
మన్మోహన్‌ సింగ్‌తో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, పులివీరన్న, వంశీకృష్ణ, ఎడ్మకిష్టారెడ్డి, నాటి కేంద్రమంత్రి కేసీఆర్‌ (ఫైల్‌)

- 2004 జూలై ఒకటిన గ్రామానికి వచ్చిన నాటి ప్రధాని

- ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో మాటామంతి

- గ్రామాభివృద్ధికి దాదాపు రూ. 70 లక్షలు మంజూరు

- గ్రామ పంచాయతీ, బాలికల హాస్టల్‌ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణం

- 2006లో కొత్తకోటలో పర్యటన - జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాకతో పాలమూరు జిల్లాలోని ధర్మాపూర్‌ గ్రామం దశ మారిపోయింది. ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెలన్నర రోజులకే పాలమూరు పర్యటనకు వచ్చారు. రెండు దశాబ్దాల క్రితం ఓ గ్రామానికి రూ.40 నుంచి రూ. 50 వేల నిధులు ఇచ్చా రంటే అదే గొప్ప విషయంగా ఉండేది. అలాంటిది ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం సమీపంలోని ధర్మాపూర్‌లో పర్యటించిన సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం దాదాపు రూ.70 లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగింది.

గుర్తు చేసుకున్న ధర్మాపూర్‌ ప్రజలు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ధర్మాపూర్‌ గ్రా మంలో ఆయన పర్యటన విశేషాలను స్థానికులు గుర్తు చేసుకున్నారు. ఆయన రాకతోనే ఊరు దశ, దిశ మారిందని యాది చేసుకున్నారు. 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కేంద్రంలో మన్మోహన్‌సింగ్‌ ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప ట్టారు. 2004 జూలై ఒకటిన ప్రధానమంత్రి దేశంలోని అత్యంత వెనకబడిన జిల్లాల్లో పర్యటించారు. ఇందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆఽంధ్రప్రదేశ్‌లోని అత్యంత వెనకబడిన జిల్లా అయిన పాలమూరుకు వచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ధర్మాపూర్‌ గ్రామంలో పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. మొత్తం 13 రైతు కుటుంబాలకు రూ. 1.50 లక్షల చొప్పున రూ.19.50 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రధాని పర్యటన అనంతరం గ్రామంలో అభి వృద్ధి పనులు శరవేగంగా కొనసాగాయి. ఆధునిక గ్రామ పంచాయతీ భవనం, వాటర్‌ట్యాంక్‌, బీసీ వసతి గృహ నిర్మాణంతో పాటు, పలు కాలనీల్లో సీసీ రోడ్లు వేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న సీసీ రోడ్లలో మూడో వంతు అప్పుడు వేసినవే ఉన్నాయి. అదే సమయంలో నాటి రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడు విడతల్లో ఆదర్శ గ్రామాలను ఎంపిక చేయగా, ధర్మాపూర్‌ మొదటి విడతలోనే ఆదర్శ గ్రామంగా ఎంపికయ్యింది. దీంతో గ్రామాభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులను కేటా యించింది. 2004 ఎన్నికలప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పా ర్టీకి టీఆర్‌ఎస్‌ మిత్రపక్షంగా ఉంది. అప్పుడు ఎంపీగా గెలిచిన కేసీఆర్‌ మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ప్రధాని ధర్మాపూర్‌ పర్యటనకు హాజరయ్యారు.

నాడు ప్రొటోకాల్‌లో ఉన్న వారిలో..

దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ధర్మాపూర్‌ పర్యటన సందర్బంగా నాడు ప్రొటోకాల్‌లో కీలకంగా ఉన్న ముఖ్య నాయకులు ఇప్పుడు లేరు. అప్పడు గ్రామ సర్పంచ్‌గా ఉన్న మైబూయాదవ్‌, ఎమ్మెల్యే పులివీరన్న, ఎంపీ విఠల్‌ రావు, ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలు దివంగతులయ్యారు. ఈ విషయాన్ని కూడా గ్రామ స్థులు యాది చేసుకుంటున్నారు.

జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన

కొత్తకోట (ఆంధ్రజ్యోతి) : హైదారాబాద్‌ టు బెంగళూరు 44వ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ అంటేనే ఈ ప్రాంత వాసులకు మాజీ ప్రధాన మంత్రి, దివంగత మన్మోహన్‌ సింగ్‌ గుర్తుకు వస్తారు. 2006, అక్టోబరు 26న ఆయన అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్‌రెడ్డి, దివంగత జైపాల్‌రెడ్డిలతో కలిసి కొత్తకోటకు వచ్చారు. నాలుగు లేన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. గురువారం రాత్రి ఆయన మృతి చెందడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Dec 27 , 2024 | 11:17 PM