Share News

తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:02 PM

వచ్చే రెండు నెలల పాటు తాగునీటి సరఫరా అంశం కీలకమైనదని, అధికారులు దీనిని దృష్టిలో ఉంచుకొని, అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం
అలంపూర్‌ మునిసిపల్‌ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- అలంపూర్‌ పట్టణంలో పర్యటన

- తాగునీటి వనరుల పరిశీలన

అలంపూర్‌, ఏప్రిల్‌ 18 : వచ్చే రెండు నెలల పాటు తాగునీటి సరఫరా అంశం కీలకమైనదని, అధికారులు దీనిని దృష్టిలో ఉంచుకొని, అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. అలంపూర్‌ పట్టణంలోని ఒకటి, ఏడు, తొమ్మిదవ వార్డులలో గురువారం ఆయన పర్యటించారు. తాగునీటి సరఫరాలో సమస్యలను తెలుసుకున్నారు. తుంగభద్ర నదిలో నీటి నిల్వను మునిసిపల్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. నీటి సమస్య ఉన్న వార్డుల్లో స్థానికంగా ఉన్న నీటి వనరులను వినియోగించుకోవాలన్నారు. చేతిపంపులు, బోరు మోటార్లను మరమ్మతు చేయించి, నీటి సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. పైపులైన్లను మరమ్మతు చేయించి, లీకేజీలను అరికట్టా లని ఆదేశించారు. నదిలో నిల్వ ఉన్న నీటిని పంపింగ్‌ చేసి, గృహ అవసరాల కోసం వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు ఐదులక్షల నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. వేసవి పూర్తయ్యే వరకు ప్రతీ రోజు రెండు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం జడ్పీహెచ్‌ఎస్‌, బాలికల పాఠశాలలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల, మన ఊరు మన బడి పథకాల కింద చేపట్టిన పనులను పరిశీలించారు. తాగునీరు, ఫ్లోరింగ్‌, మరుగుదొడ్లు, డిజిటల్‌ క్లాస్‌రూంలను పరిశీలించారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ఈఈ భీమేశ్వరరావు, మునిసిపల్‌ కమిషనర్‌ సరస్వతి, ఇంజనీరు మేఘనాథ్‌గౌడ్‌, ఎంపీడీవో అబ్దుల్‌ జబ్బార్‌, ఎంఈవో అశోక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

గద్వాల న్యూటౌన్‌ : మిషన్‌ భగీరథ, జిల్లా పరిషత్‌, పంచాయతీ అధికారులు సమన్వయంతో పని చేసి, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు కలుగకుండా చూడా లని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం నిర్వహిం చిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత వారం నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు చేపట్టిన పనులపై ఆరా తీశారు. గట్టు, అయిజ, మానవ పాడు, ఇటిక్యాల మండలాల్లోని గ్రామ పంచాయతీల వారీగా పురోగతిలో ఉన్నవి, పూర్తయినవి, కావలసిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రజల అవసరాలకు ఎన్ని లీటర్ల నీరు అవసరం, ఈ మేరకు సరఫరా చేస్తున్నామనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట చేతిపంపులకు బోరు మోటార్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పైప్‌లైన్లను మరమ్మతు చేయించి నీటి సరఫరా సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవా లన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని, వచ్చే రెండు నెలలు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో మిషన్‌ భగీరథ ఎస్‌ఈ జగన్‌మోహన్‌రెడ్డి, ఈఈలు శ్రీధర్‌రెడ్డి, భీమేశ్వరరావు, డీఆర్‌డీవో నర్సింగరావు, డీపీవో వెంకట్‌రెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:02 PM