Share News

రైతులకు ‘ఉపాధి’

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:35 PM

ఉపాధి హామీలో కూలీలకే కాదు రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. వ్యవసాయ సాగుతో పాటు, పాడి రైతులు ఉపాధి పనులతో లబ్ధిపొందనున్నారు.

 రైతులకు ‘ఉపాధి’
కానాయపల్లిలో ఉపాది ద్వారా నిర్మించిన పశువుల పాక

- పశువుల పాక నిర్మాణానికి రూ. 85 వేలు

- పాడి పశువుల గడ్డి పెంపకానికి రూ.6 వేలు

- పంట పొలాల దారికి నిధులు

కోయిలకొండ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీలో కూలీలకే కాదు రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. వ్యవసాయ సాగుతో పాటు, పాడి రైతులు ఉపాధి పనులతో లబ్ధిపొందనున్నారు. మండలంలో 2024-25 సంవత్సరానికి ఉపాధిహామీ పనుల ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా రైతులు తమ పొలంలో పశువుల పాక నిర్మించుకోవడానికి రూ.85 వేలు, పాడి పశువులకు పశుగ్రాసం పెంచేందుకు రూ.6 వేలు అందించనున్నారు. ఇప్పటికే మండలంలో ఉపాధిహామీ ద్వారా దాదాపు 60పైగా పశువుల పాకలు నిర్మించారు. ఇందుకు గాను పాడి రైతుకు ఉపాధిహామీ ద్వారా రూ.80 వేలు చెల్లించారు. దీంతో పాటు పౌలీ్ట్ర రైతులకు వెయ్యి కోళ్లు పెంచుకునేందుకు షెడ్‌ నిర్మాణానికి రూ.3 లక్షలు అందించనున్నారు. రైతులు తమ పొలాల మధ్య దారి నిర్మాణానికి సైతం పొలం బాట ద్వారా గ్రావల్‌రోడ్డు, మట్టిరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరుకు అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులు తమ భూమి చదును చేసుకునేందుకు ఉపాధి హామీలో అవకాశం ఉంది. హర్టీ కల్చర్‌ ద్వారా ఈత, తాటి వనాలు పెంచేందుకు, పండ్ల తోటల సాగు, నర్సరీల నిర్వహణకు ఉపాధిలో నిధులు మంజూరు కానున్నాయి. జలనిధి, జన్‌భాగీధాం ద్వారా చెక్‌ డ్యామ్‌ నిర్మాణం, ఉటకుంటల నిర్మాణంతో పాటు నీటి సంరక్షణకు అవకాశం ఉంది. మండలంలోని అంకిళ్ల, మాల్కపూర్‌, ఆచార్యపూర్‌, చంద్రాసుపల్లి, రాంపూర్‌, గాంధీనగర్‌ లక్ష్మీబాయితండా గ్రామాల్లో ఉపాధి నిధులతో గ్రావెల్‌ రోడ్డు, మట్టి రోడ్లను నిర్మీంచారు. మరి కొన్ని గ్రామాల్లో రోడ్ల నిర్మాణాల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. చిన్న కారు రైతులు ఉపాఽధి పనుల సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

పశువుల పాకకు ఇలా దరఖాస్తులు..

రైతులు ఉపాధి ద్వారా పశువుల పాక కోసం గ్రామ పంచాయతీ తీర్మానం, భూమి పట్టా పాసు పుస్తకం, ఆధార్‌కార్డు, జాబ్‌కార్డు జిరాక్స్‌, రైతు 2 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. వెటర్నరి డాక్టర్‌తో పశువులు ఉన్నాయని గుర్తుంపు తీసుకోవాలి. ఇతర పనులకు ఆయా గ్రామాల టీఏలు, ఫీల్డ్‌అసిస్టెంట్ల సూచనలతో వివరాలు అందించాలి.

రైతులు లబ్ధి పొందాలి..

ఉపాధి హామీ పనుల ద్వారా రైతులు లబ్ధి పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఉపాధి పనుల వివరాలు ప్రతీ గ్రామపంచాయతీలో చర్చించాలి. 2024-25 పనుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పంచాయతీలో గ్రామసభ ద్వారా పనుల గురంచి తెలియజేయాలి. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

- నర్సయ్య, ఏపీఓ కోయిలకొండ

Updated Date - Dec 23 , 2024 | 11:35 PM