ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 04 , 2024 | 11:33 PM
పెద్దధన్వాడ శివారులో 29 ఎకరాల పంట భూమిలో వేస్తున్న ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.
- గద్వాల కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా
- సంఘీభావం తెలిపిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
గద్వాల న్యూటౌన్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పెద్దధన్వాడ శివారులో 29 ఎకరాల పంట భూమిలో వేస్తున్న ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పెద్దధన్వాడలో సర్వెనెంబర్ 174/1, 174/ఏ/1,174/ఏ2.174/బి. 174/బి/2,లో గల 29 ఎకరా ల పంట భూమిలో వేస్తున్న ఇథనాల కంపెనీ(గాయత్రి, రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్) మా గ్రామ ప్రజలకు ఎవరికీ తెలియకుండానే నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ ఇథనాల్ కంపెనీ వలన మా పెద్దధన్వాడ గ్రామమే కాకుండా చుట్టూ ఉన్న చిన్నధన్వాడ, నసనూరు, మాన్‌దొడ్డి, చిన్నతాండ్రపాడు, నౌరోజీ క్యాంపు, వేణిసోంపురం, కేశవరం, తుమ్మిళ్ల, పచ్చర్ల, తనగల, పెద్దతాండ్రపాడు, రాజోలి గ్రామాలు కూడా కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం, వ్యర్థాల వల్ల మా గ్రామ పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ జలాల వల్ల క్యాన్సర్, శ్వాసకోస సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ఈ కంపెనీని రద్దు చేయాలని, లేదంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. వీరికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడు, బీఆర్‌ఎస్ రా ష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించి కంపెనీ రద్దు చేయాలని కోరారు. ఈ ధర్నాలో రైతులు కమలాకర్, రజిని కుమార్, రాజు, వినోద్, భాగ్యరాజు, సందీప్‌కుమార్, రాజు, సూరి, ప్రవీణ్, యాకోబు, జయరామిరెడ్డి తదితరులు ఉన్నారు.