Share News

వీధిన పడుతున్న కుటుంబాలు

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:21 PM

వనపర్తి జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

వీధిన పడుతున్న కుటుంబాలు

వనపర్తి జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు

మద్యం మత్తు, అనుభవం లేని తనంతోనే అధికం

ఈ ఏడాది 225 ప్రమాదాల్లో.. 126 మంది మృతి

ఈ నెలలోనే ఎనిమిది మంది దుర్మరణం

వనపర్తి క్రైం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. ఈ ప్రమాదాలలో పలువురు మృతి చెందడంతో పాటు గాయాలపాలైన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారి, గ్రామీణ రహదారులపై కూడా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, అనుభవంలేని తనంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై ఎక్కువ శాతం తెల్లవారుజామున ప్రమాదాలు జరుగుతున్నాయి.

అడ్డగోలుగా మద్యం విక్రయాలు..

జిల్లాలోని జాతీయ రహదారితో పాటు గ్రామీణ రోడ్ల వెంబడి దాబాలతో పాటు కిరాణ దుకాణాలలో 24 గంటలు మద్యం విక్రయిస్తుండడంతో వాహన దారులఉ మద్యం తాగి వాహనాలను నడిపిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ తతంగమంతా పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారుల కనుసన్నల్లోనే నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. చాలాసార్లు గ్రామీణ యువత సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా బెల్ట్‌ షాపుల నిర్వహణను కట్టడి చేయలేకపోతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 225 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 126 మంది మృతి చెందారు. 237 మంది గాయపడ్డారు. గతేడాది జరిగిన 218 రోడ్డు ప్రమాదాల్లో 124 మంది మృతి చెందారు. 200 మంది గాయపడ్డారు. గతేడాది కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నెలలో పదిరోజుల వ్యవధిలోనే ఎనిమిది మంది మృతి చెందారు. 9వ తేదీన వనపర్తి మండలంలోని సవాయిగూడెం వద్ద కూలీలు వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. అదే రోజు రేవల్లి మండలంలోని చెన్నారం సమీపంలో ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. 10వ తేదీన అమరచింత మండలంలోని మస్తీపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 13వ తేదీన ముమ్మళ్లపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. 16వ తేదీన పెద్దమందడి బుర్రవాగు వద్ద బోర్‌ వెల్‌ లారీ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. 17న చిమనగుంటపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని వడ్ల లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.

Updated Date - Nov 20 , 2024 | 11:21 PM