Share News

కుటుంబాల వివరాలు సమగ్రంగా ఉండాలి

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:11 PM

ఇంటింటి సర్వేలో సేకరించే కుటుంబాల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కులానికి సంబంధించిన వివరాలు సమగ్రంగా సేకరించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులు, ఎన్యుమరేట్లకు సూచించారు.

కుటుంబాల వివరాలు సమగ్రంగా ఉండాలి
ధరూరు బీసీ కాలనీలో సూచనలిస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల టౌన్‌, ధరూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ఇంటింటి సర్వేలో సేకరించే కుటుంబాల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కులానికి సంబంధించిన వివరాలు సమగ్రంగా సేకరించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులు, ఎన్యుమరేట్లకు సూచించారు. వివరాల సేకరణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పట్టణంలో బుధవారం చేపట్టిన సర్వే పనులను స్థానిక నల్లకుంట, వీవర్స్‌కాలనీ, వడ్లవీధి తదితర చోట్ల కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే నిర్వహణ కోసం ఆయా ఇళ్ల వద్ద ఇప్పటికే అతికించిన స్టిక్కర్లను పరిశీలించిన కలెక్టర్‌ కుటుంబాల లెక్కను ఇంటిలోని వంట గది ఆధారంగా గుర్తించాలన్నారు. పెళ్లిళ్లు జరిగి అందరూ ఉమ్మడి కుటుంబంగా ఒకే గృహంలో ఉన్నట్లు అయితే దాన్ని ఒకే కుటుంబంగా లెక్కించాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. ఖాళాగా ఉన్న కుటుంబాలకు సైతం తప్పనిసరిగా వేకెంట్‌ అనే స్టిక్కర్‌ అతికించాలన్నారు. మూడు రోజుల పాటు హౌస్‌ లిస్టింగ్‌ ప్రక్రియను పూర్తి చేసి ఈనెల 9వ తేదీ నుంచి సమగ్ర వివరాలను సేకరించాలన్నారు. కాగా, సర్వేలో నియమితులైన ఎస్‌జీటీ ఉపాధ్యాయులు ఒంటిపూట బడుల్లో విధులు నిర్వహించి, మధ్యాహ్నం నుంచి సర్వేలో పాల్గొనాలన్నారు. అంతకుముందు ధరూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో సర్వేను పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, మునిసిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ ఎల్లారెడ్డి, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

సర్వే పారదర్శకంగా జరగాలి

అయిజ/టౌన్‌/ఉండవల్లి/గట్టు/మల్దకల్‌/మానవపాడు : ఇంటింటి సర్వే పాదర్శకంగా జరగాలని అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు. బుధవారం అయిజ మండలం ఉత్తనూరు, ఉప్పల్‌ గ్రామంలో పర్యటించి హౌజ్‌ హోల్డ్‌ సర్వే పరిశీలించారు. ఉప్పల్‌ గ్రామంలో చేపట్టబోయే నర్సరీని సందర్శించారు. సర్వేలో ఎలాంటి పొరబాట్లు లేకుండా చూడాలని ఎనిమరేటర్లకు సూచించారు. ఉండవల్లి మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో మొత్తం 51 ఎనిమిరేటర్స్‌ మొదటిరోజు ఇంటి యజమాని పేరు నమోదు చేసుకుని ఆ ఇంటికి స్టిక్కరును అంటించారు. సర్వేను ఎంపీడీవో తిరుపతన్న పర్యవేక్షించారు. గట్టు మండలంలో మొత్తం 16,695 ఇళ్ల సర్వే కోసం 101 బ్లాక్‌లుగా ఏర్పాటు చేశారు. బుధవారం ఆలూరు గ్రామంలో నిర్వహించిన సర్వేను మండల ప్రత్యేకాధికారి గోవిందయ్య, ఎంపీడీవో చెన్నయ్య పరిశీలించారు. మల్దకల్‌ మండలంలోని 25 గ్రామాల్లో సర్వే ప్రారంభం కాగా ఎన్యుమరేటర్లు ఇళ్లకు స్టిక్కర్లు అతికించే కార్యక్రమం చేపట్టారు. డీపీవో శ్యాంసుందర్‌ తాటికుంట, అమరవాయి, పెద్దపల్లె గ్రామాల్లో సర్వేను పరిశీలించారు. ఎంపీడీవో ఆంజనేయరెడ్డి, ఎంపీవో రాజశేఖర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షించారు. మండలంలో 14,856 గృహాలు ఉండగా, 97 మంది ఎన్యుమరేటర్లను నియమించినట్లు ఎంపీడీవో తెలిపారు. మానవపాడు మండలంలో ఎంపీడీవో భాస్కర్‌ ఆధ్వర్యంలో సర్వే కొనసాగగా, అధికారులు ఇంటింటికి స్టిక్కర్లు అతికించారు.

Updated Date - Nov 06 , 2024 | 11:11 PM