పాలమూరులో ఆటల పండుగ
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:47 PM
ఆటల పండుగకు పాలమూరు సిద్ధం అవుతోంది. సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ, నెట్‌బాల్ పోటీలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం వేదిక కానున్నది.
- రేపటి నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
- 33 జిల్లాల నుంచి తరలిరానున్న 850 మంది క్రీడాకారులు
- మహబూబ్‌నగర్ స్టేడియం మైదానంలో చురుగ్గా ఏర్పాట్లు
- 31 నుంచి రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ టోర్నమెంట్
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఆటల పండుగకు పాలమూరు సిద్ధం అవుతోంది. సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ, నెట్‌బాల్ పోటీలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం వేదిక కానున్నది. ఏడాది పాలన ముగిసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహి స్తోంది. అందులో భాగంగా గ్రామీణ క్రీడాకారుల ప్రతి భను వెలికి తీసేందుకు ‘సీఎం కప్’ పోటీలను ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నెల ఐదు నుంచి 24వ తేదీ వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయి పోటీలు ముగిశాయి. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకా రులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, 31 నుంచి జనవరి రెండవ తేదీ వరకు నెట్ బాల్ పోటీలను నిర్వహించేందుకు జిల్లా క్రీడాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం
మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్వహించనున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు రాష్ట్రం లోని 33 జిల్లాల నుంచి 850 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. వారితో పాటు 100 మందికి పైగా కోచ్‌లు, మేనేజర్లు హాజరుకానున్నారు. 27వ తేదీన ఉదయం 11 గంటలకు క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ పార్ల మెంట్ సభ్యురాలు డీకే అరుణ, మైనార్టీ కార్పొరే షన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్ ముఖ్య అతిథు లుగా హాజరు కానున్నారు. క్రీడాశాఖ జిల్లా అధికారు లు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు
సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడా శాఖ జిల్లా అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీడా సం ఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకా రులు వారికి సహకరిస్తున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలను నిర్వహించనున్నారు. ప్రధాన స్టేడియం మైదానంలో ఆరు కోర్టులు ఏర్పాటు చేశారు. ఒక వేళ వర్షం పడితే మ్యాచ్‌లను ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. పోటీలకు తరలిరానున్న క్రీడాకా రులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసర మైన ఏర్పాట్లు చేశారు. బాలికలకు ఎన్‌టీఆర్ డిగ్రీ కళాశాల, బీపీహెచ్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనం, బాలురకు ఫాతిమా, రెయిన్‌బో స్కూల్, మాడ్రన్ హై స్కూల్, అంబేద్కర్ భవన్, ఎంవీఎస్ కళాశాలల్లో బస, స్టేడియం మైదానంలో భోజనం, ఇతర వసతులు ఏర్పాటు చేశారు.
టోర్నమెంట్లకు ఏర్పాట్లు పూర్తి చేశాం
అందరి సహకారంతో రాష్ట్ర స్థాయి టోర్నమెం ట్లను విజయవంతంగా నిర్వహిస్తాం. గ్రామీణ ప్రాంత యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తోంది. ఇప్పటికే జిల్లా, ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలు ముగిశాయి. మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర స్థాయి కబడ్డీ, నెట్‌బాల్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేశాం.
- ఎస్. శ్రీనివాస్, డీవైఎస్‌వో, మహబూబ్‌నగర్.
పూర్తి సహకారం అందిస్తాం
జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించ నున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పూర్తి సహకారం అందిస్తు న్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం.
- కురుమూర్తిగౌడ్, జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి.