Share News

సైనిక పతాక దినోత్సవ నిధి ఏర్పాటు

ABN , Publish Date - Dec 07 , 2024 | 11:22 PM

దేశ రక్షణ కోసం సరిహద్దులో బాధ్యత, త్యాగనిరతి, అంకితభావంతో మహత్తర భూమిక నిర్వహిస్తున్న సైనికుల సహాయార్థం సైనిక పతాక దినోత్సవ నిధి ఏర్పాటు చేసినట్లు మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ విజయేందిర బోయి తెలిపారు.

సైనిక పతాక దినోత్సవ నిధి ఏర్పాటు
సైనిక పతాక నిధికి విరాళాన్ని అందిస్తున్న కలెక్టర్‌ విజయేందిర బోయ

కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ కోసం సరిహద్దులో బాధ్యత, త్యాగనిరతి, అంకితభావంతో మహత్తర భూమిక నిర్వహిస్తున్న సైనికుల సహాయార్థం సైనిక పతాక దినోత్సవ నిధి ఏర్పాటు చేసినట్లు మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ విజయేందిర బోయి తెలిపారు. శనివారం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయ నిధికి కలెక్టర్‌ విరాళం అందించి, విరాలాల సేకరణను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పతాక నిధికి అధిక మొత్తంలో విరాళం సేకరించిన జిల్లాను రాష్ట్రం హోం శాఖ మంత్రి ద్వారా సాయుధ దళాల పతాక దినోత్సవం రోజు సత్కారం చేస్తారని చెప్పారు. తోచిన విరాళాలు అందించి, దేశ రక్షణలో జీవితం అంకితం చేసిన సైనికులు, వారి కుటుంబాలకు సాయం చేసేందుకు సహరించాలని ఆమె కోరారు. దాతలు విరాళాన్ని డిమాండ్‌ డ్రాఫ్ట్‌ లేదా చెక్కు రూపంలో డైరెక్టర్‌, సైనిక్‌ వెల్ఫేర్‌, తెలంగాణ, హైదరాబాద్‌-500032 పేరున ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి మహబూబ్‌నర్‌ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఉదారంగా సహాయం అందించిన వారికి సెక్షన్‌ 80జి(5)(6), 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుందన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది నుంచి విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో మాజీ సైనికులు వేణుగోపాల్‌ రెడ్డి, ఎస్‌కేవీ ప్రసాద్‌, రాములు, టి.రాజవర్ధన్‌ రెడ్డి, వెంకట్‌ గౌడ్‌, ఎండీ సామ్యూల్‌, రహమత్‌ బేగ్‌, ఎన్‌సీసీ అధికారులు, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 11:22 PM